- వేసే ఒక్కో వోటు నన్ను మరింత బలపరుస్తుంది
- పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలి˜ విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిథ్యం
- గంగా నది నన్ను అక్కున చేర్చుకున్నది ˜ ప్రధాని మోదీ వీడియో సందేశం
- వారణాసి లోక్‌సభ నుంచి పోటీలో ప్రధాని మోదీ
న్యూదిల్లీ, మే 30 : దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఈ నేపథ్యంలో వారణాసి ఓటర్లకు ప్రధాని మోదీ వీడియో సందేశం పంపారు. ‘మీరు వేసే ఒక్కో ఓటు నన్ను మరింత బలపరుస్తుంది. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి. ఓటర్లందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక కాశీ. వారణాసి ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని. సంగీతం, శాస్త్రాలకు కాశీ నిలయం. విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. గంగా నది నన్ను అక్కున చేర్చుకున్నది’ అంటూ ఆ వీడియో సందేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తున్నారు. కాగా, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఆరు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యింది. 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఎనిమిది రాష్ట్రాలు, మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 57 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది.
ఈ పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార?ండ్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనున్నది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ నుంచి 13 స్థానాలకు, పశ్చిమబెంగాల్ నుంచి 9 స్థానాలకు, బీహార్ నుంచి 8 స్థానాలకు, ఒడిశా నుంచి 6 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 4 స్థానాలకు, జార?ండ్ నుంచి 3 స్థానాలకు, చండీగఢ్ నుంచి ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనున్నది. ఇప్పటివరకు మొదటి దశలో 102 నియోజకవర్గాల్లో 66.14 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రెండో దశలో 88 నియోజకవర్గాల్లో 66.71 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మూడో దశలో 94 నియోజకవర్గాల్లో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో 96 నియోజకవర్గాల్లో 69.16 శాతం పోలింగ్ నమోదైంది. ఐదో దశలో 49 నియోజకవర్గాల్లో 62.2 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక ఆరో దశలో 57 నియోజకవర్గాల్లో 61.98 శాతం పోలింగ్ నమోదైంది.
2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. కాగా.. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన చివరి ర్యాలీని నిర్వహించారు. సిక్కులపై కీలక ప్రకటన చేసిన మోదీ, అయోధ్యలో రామ జన్మస్థలం కోసం సిక్కులు మొదటి యుద్ధం చేశారన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించి ఏడోవ, చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరుగుతుంది. ఈరోజుతో అంటే గురువారం ఎన్నికల ప్రచారం నిలిచిపోనుంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో చివరి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తన చివరి ర్యాలీని ఇక్కడే నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పంజాబ్ మన భారతదేశానికి గుర్తింపు అని, ఇది మన గురువుల పుణ్యభూమి అని అన్నారు.
అంతేకాదు అయోధ్యలో రామ జన్మభూమి కోసం తొలి యుద్ధం చేసింది సిక్కులే అని అన్నారు. నేడు దేశంలో ఆకాంక్షలు కొత్తవి, అంచనాలు కొత్తవి, విశ్వాసం కొత్తవి అని ప్రధాని అన్నారు. దశాబ్దాల తరవాత అలాంటి సమయం రాగానే సంపూర్ణ మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ప్రతి భారతీయుడి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే కల త్వరలోనే నేరబోతుందన్నారు అందుకే ప్రతి దేశస్థుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారన్నారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయాలని దేశప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోంది. 21వ శతాబ్ది భారతదేశానికి బలమైన ప్రభుత్వం అవసరమని ప్రధాని అన్నారు.
శత్రువును ఓడిరచగల బలమైన ప్రభుత్వం ఏర్పాటు కావల్సిన అవసరముందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలో కూడా నిర్ణయించామన్నారు. 125 రోజుల రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. వారణాసి ఎంపీగా కాశీని అన్ని విధాలుగా అభివృద్ది చేశానన్నారు. మధ్యప్రదేశ్‌లో రవిదాస్ ఆలయానికి శంకుస్థాపన చేయడం నాకు దక్కిందని ప్రధాని అన్నారు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించాం. మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని నిర్మించామన్న మోదీ, ఆదంపూర్ విమానాశ్రయానికి గురు రవిదాస్ పేరు పెట్టాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది అమలులోకి వొస్తుందన్నారు.





