జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరణ

  • భారీ వర్షాలు, విపత్తులను సమర్థంగా ఎదుర్కునడానికి చర్యలు
  • సిఎం ఆదేశాల మేరకు అధికారులతో సిఎస్‌ ప్రత్యేక సమావేశం
  • వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాలలో డీఆర్‌ఎఫ్‌ బృందాల ఏర్పాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కుని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధి వరకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. హైదరాబాద్‌ నగరంతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధి    వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వొచ్చినా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ ఇంచార్జ్‌ కమీషనర్‌ ఆమ్రపాలి, జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సిఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ…జీహెచ్‌ ఎంసీ లోని డిజాస్టర్‌ రెస్పాన్స్‌ విభాగాన్ని మరింత పటిష్ఠ పరుస్తున్నామని, ఇందుకుగాను విపత్తులను ఎదుర్కునడానికి అదనపు సిబ్బందిని, తగు యంత్ర పరికరాలను అందచేయనున్నామని వివరించారు. ఇప్పటికే, జీహెచ్‌ ఎంసీ పరిధిలో 30 డీఆర్‌ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయని, వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటు చేసి వీటి సేవలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించనున్నట్టు వెల్లడిరచారు. హైదరాబాద్‌ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నందున, కెమికల్‌ ఫైర్‌ నివారణకు ప్రత్యేక శిక్షణతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతి కుమారి సూచించారు.

కాగా, హైదరాబాద్‌ నగరంలో 141 సమస్యాత్మక ప్రాంతాలలో మున్సిపల్‌, పోలీస్‌, విద్యుత్‌, జలమండలి తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టాలని సిఎస్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాలలో కూడా డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న డీఆర్‌ఎఫ్‌ బృందాలను పటిష్ట పర్చడం చేయాలని ఆదేశించారు. విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్‌ఎఫ్‌ విభాగంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేశంలోని ప్రధాన మహానగరాలైన ముంబయి, దిల్లీ , చెన్నై, బెంగుళూరు లలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాల పనితీరుపై కూడా అధ్యయనం చేయాలని సిఎస్‌ ఈ సందర్భంగా అధకారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *