రామనాథం, గురునాథం ఇద్దరూ సన్నకారు రైతులు. ఇద్దరి కొడుకులు, కూతుళ్లు మంచి స్నేహితులు. కలిసి పెరిగారు, కలిసే చదివారు. రామనాథం కొడుకు ప్రకాష్ డిగ్రీ అయిపోయి అమ్మానాన్నలకు చేదోడుగా వ్యవసాయం చేస్తూ పిజి సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. కూతురు గిరిజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది గురునాథం కూతురు నీలిమ లాగే. ఒకరోజు పొలం గట్ల మీద ఎదురుపడి అరకొర చదువులు చదివితే ఇలా ఊళ్లోనే ఉండిపోవాల్సి వస్తది .నా కొడుకు మోహన్ చూడు బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వెంటనే క్యాంపస్ సెలక్షన్స్ లో ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాడు. అని గురునాథం ప్రకాష్ ని తక్కువ చేసి మాట్లాడుతాడు.
సాహిత్యం చదివే అలవాటు ఉన్న ప్రకాష్ ఏ కాస్త సున్నితత్వానికి లోనైనా ఆరోజు రాత్రంతా కూర్చొని మహనీయుల జీవిత చరిత్రలు తిరగేస్తుంటాడు. అలా చదివే అలవాటుతోనే జీవిత సారాంశం తెలిసింది కాబోలు…… గిరిజని, నీలిమని కూర్చోబెట్టి తను కూడా వాళ్లతో పాటు పీజీ కోసం బాగా ప్రయత్నిస్తాడు. అదే సమయంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా పాస్ కావడంతో ప్రకాష్ కానిస్టేబుల్ గా, గిరిజ, నీలిమలిద్దరూ పీజీ చేస్తూ సిటీలో సెటిల్ అయ్యారు.
మోహన్ బిటెక్ అయిపోయిన తర్వాత జాబ్ లేకుండా ఇంటికి రావడం గురునాధానికి ఏమాత్రం నచ్చకపోవడంతో రెండు రోజుల్లోనే సిటీకి తిరిగి బయలుదేరుతాడు. కన్సల్టెన్సీ సహాయంతో ప్రైవేట్ ఉద్యోగిగా దుబాయ్ వెళ్తున్నానని సంవత్సరానికి 5 లక్షల జీతంతో జాబ్ దొరికిందని ముందు ముందు ఇంకా జీతం పెరుగుతుందని సంతోషంగా సిటీలో ఉన్న చెల్లెలు నీలిమకు, ఊళ్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి వెళ్ళిపోతాడు.
ప్రకాష్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే పీజీ పూర్తి చేయాలనే సంకల్పంతో దూర విద్యా విధానం ద్వారా ఎం ఏ తెలుగు పూర్తి చేస్తాడు. స్టేషన్లో తోటి కానిస్టేబుల్ లు, ఎస్సై వంటి వారు ఇతని సంతోషాన్ని పంచుకుంటారు. ఒకవైపు పోలీస్ వృత్తి, మరొకవైపు సాహిత్యం ఎలా కుదురుతుంది రెండిరటికి …. అని ఎస్ఐ అన్న మాటలు ప్రకాష్ ని ఆలోచించేలా చేస్తాయి.
గిరిజకు పీజీ మధ్యలో ఉండగానే బీఈడీ లో ప్రవేశం దొరకడంతో టీచర్ ట్రైనింగ్ చేస్తుంది. నీలిమ మాత్రం పీజీ నే కొనసాగిస్తుంది. గిరిజను చూసి తను కూడా టీచర్ వృత్తిలోకి వస్తే సాహితీ సేవలో ఉండొచ్చు, సాహిత్యాన్ని ఆదరించడానికి నాకు కాస్త సమయం దొరుకుతుందేమో అని ఆలోచించి దూర విద్యా విధానం ద్వారా బీఈడీ కూడా పూర్తి చేస్తాడు ప్రకాష్. ఎన్నికల పుణ్యమా అని అదే సంవత్సరం నోటిఫికేషన్లు వెల్లువలా వచ్చి పడతాయి. ప్రకాష్ తో సహా నీలిమ, గిరిజలు వారి అర్హతకు తగినన్ని ఉద్యోగ పరీక్షలు రాస్తారు. కానీ కాలం కలిసి రాక పరీక్షలు అన్నింటిపై కోర్టు స్టే ఇవ్వడంతో రామనాథం కూతురు వివాహం చేద్దామనే ఉద్దేశంతో గురునాథం దగ్గరకు వెళ్ళి మన పిల్లలకు కుండ మార్పిడి వివాహం చేద్దామా దీని ద్వారా మన స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవచ్చు అంటాడు.
నచ్చని గురునాథం నీ కూతురు టీచర్ చదువు చదివింది. నా కొడుకు దుబాయి ఇంజనీరు. పైగా నీ కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా చేసేలా కనపడట్లేదు. ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలిసింది. నా కూతురుకు ఇంజనీరు సంబంధం చూద్దామని అనుకుంటున్నా అని సమాధానం ఇవ్వడంతో మనసు నొచ్చుకున్నవాడై ఇంటికి తిరిగి వెళ్తాడు రామనాథం.
దుబాయ్ నుంచి మోహన్ దసరా పండక్కని గ్రామానికి వస్తాడు. ప్రకాష్ ని చూడగానే క్షేమ సమాచారాల భాగంలో ఈ రెండేళ్లు జాబ్ బాగానే నడిచింది కానీ ప్రస్తుతం చేతిలో ఏ ప్రాజెక్టు లేక బెంచ్ మీద ఉన్నాను మామ త్వరలోనే మన హైదరాబాద్ కి వద్దామనుకుంటున్నాను అంటూ చెల్లెలు నీలిమ కనపడగానే లగేజ్ తో ఇంటికి వెళతాడు మోహన్.
దసరా కానుకగా కోర్టు అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి స్టే ఎత్తివేసి ఫలితాలను విడుదల చేయాలని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది.
తెల్లవారగానే న్యూస్ పేపర్ లో ప్రకాష్ కి లెక్చరర్ జాబ్ వచ్చినట్లు, గిరిజ టీచర్ గా, నీలిమ జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయినట్లు రిజల్ట్ రావడంతో గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొన్నది.
ప్రకాష్ ప్రెస్ వాళ్ళతో పుస్తకం చదివే అలవాటు చేయించిన టీచర్లు అందరికీ ఈ నా లెక్చరర్ ఉద్యోగాన్ని అంకితం చేస్తున్నట్లు అలాగే కానిస్టేబుల్ గా సమాజపు లోతుల్ని చూశానని ఆ అనుభవాలను అన్నిటిని ఉపయోగించుకొని సమాజానికి హితవు చేకూరేలా విద్యార్థులను తయారు చేస్తానని ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భాన్ని మోహన్ పక్కనే ఉండి సంతోషంగా అనుభూతి చెందుతాడు.
గబగబా ఇంటికి వెళ్లి మన నీలిమని ప్రకాష్ కి ఇచ్చి వివాహం చేద్దాం నాన్న అనడంతో ప్రకాష్ వాళ్ళ అమ్మ జరిగింది చెబుతుంది. అవును రా చెల్లిని నీలాగా ఇంజనీర్ కి ఇచ్చి చేయాలనుందిరా పెద్ద జీతం వస్తుందని అంటాడు గురునాథం.
బ్రతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి మాట నాన్న. కానీ ఒక ఐదు సంవత్సరాలు తిరిగేసరికి లక్ష రూపాయల జీతం తీసుకుంటాడు, స్థిరమైన జీవితంలో ఉంటాడు నాన్న ప్రకాష్. పైగా వాడి పట్టుదల, భావజాలం వింటుంటే ఇంకా పై చదువులు చదివి త్వరలోనే యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా అవుతాడు అనిపిస్తుంది. అప్పుడు నేను పనికిరాను నాన్న. అంటూ….. అవును నా ఉద్యోగంలో అభద్రతా భావం ఎక్కువ. దానికి తోడు వేరే ఏ దేశంలోనో, ఏ రాష్ట్రంలోనో నా అన్న వాళ్ళని వదిలేసి మేము కన్న పిల్లల్ని ఒంటరిగా మేమే చూసుకుంటూ బ్రతకాలి. ఖర్చులు కూడా ఎక్కువే. అని లోకల్ ఉద్యోగానికి, లోకల్ బ్రతుకుకి ఉన్న విలువను తండ్రికి అర్థమయ్యేలా చెబుతాడు మోహన్.
పైగా…. కుండ మార్పిడి వివాహంతో ఏ విధంగా చూసినా మన కుటుంబానికి ఎక్కువ లాభం నాన్న. ప్రకాష్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాపురం ఉంటాడు కాబట్టి ఇరువురి పొలాలను మధ్యలో వచ్చి చూసుకోగలుగుతాడు. అనడంతో గురునాథం తన కొడుకు లోతైన ఆలోచనకు ముక్కు మీద వేలేసుకుంటాడు.
గురునాథం రామనాథం దగ్గరికి వెళ్లి గత నెలలో నా ప్రవర్తనకు నన్ను మన్నించు చిన్న మనసుతో ఆలోచించాను. ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని మన స్నేహ బంధాన్ని వియ్యంకుల బంధంగా మార్చురా. నీ పెంపకంలో నా కొడుకు చల్లగా ఉంటాడు అనడంతో మోహన్ వైపు చూస్తూ….ఆ…. ఇంజనీర్లు తమ భార్యల్ని టీచర్ ఉద్యోగాలు చేయనీయరుగా అని గిరిజ పలుకుతుంది. వెంటనే మోహన్ అమ్మ పంతులమ్మ నీ జీతం తెలిసి కూడా చేయనీ యనంటావా అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు. అంటే జీతం కోసమేనా నాతో పెళ్లి అని నీలిమ కూడా ప్రకాష్ తో అనడంతో….. ప్రకాష్ తల్లి పెళ్లిళ్లు వద్దు కానీ రిసెప్షన్ డేట్ ఖాయం చేద్దాం అని గిరిజను ముట్టికాయ వేయడంతో అందరూ నవ్వుతారు.
-పి.మృదుల
తెలుగు అధ్యాపకురాలు
సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల,
నాగర్కర్నూల్.





