జిహెచ్‌ఎం‌సి నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి

  • కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం
  • కటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : అం‌బర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు సీరియస్‌ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వొచ్చిన కథనాలను సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై గురువారం చీఫ్‌ ‌జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భుయాన్‌, ‌జస్టిస్‌ ఎన్‌.‌తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో మున్సిపల్‌ ‌శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్‌ ‌కలెక్టర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ, తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

జీహెచ్‌ఎం‌సీ నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్‌ఎం‌సీని ప్రశ్నించింది. రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నాలుగేళ్ల పసివాడు ప్రదీప్‌ను వీధి కుక్కలు పొట్టనపెట్టుకున్నాయి. బాలుడు ప్రదీప్‌ ‌మృతి ఘటనలో అంబర్‌పేట పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పసివాడు మరణించి నాలుగు రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 19న ఘటన జరిగిన విషయం తెలిసిందే. ప్రదీప్‌ ‌తండ్రి గంగాధర్‌ 100‌కు ఫోన్‌ ‌చేయగా.. ఘటనాస్థలానికి వొచ్చిన పోలీసులు, ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం బాధ్యతారాహిత్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, తాము ఎవరిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పడం.. సమస్యను దాటవేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గోల్నాక సెక్టార్‌ ఎస్సై విజయ్‌కు ఇన్‌చార్జి సీఐ ప్రభాకర్‌ ‌షోకాజ్‌ ‌నోటీసు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *