జిల్లా వ్యాప్తంగా నగదు, ఆభరణాలు తరలింపుపై విస్తృతంగా తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించరాదని ఈ విషయంలో అధికారులకు సహకరించాలని ప్రజలకు సూచిస్తూనే, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన సమయంలో అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 104 దరఖాస్తులకు సంబంధించి రూ.3,49,92,241 సొత్తును స్వాధీనం చేసుకోగా మేడ్చల్ మల్కాజిగిరి గ్రీవెన్స్ కమిటీ అధికారులు అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించి రూ.2,11,80,761 తిరిగి వారికి అప్పగించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ  మంగళవారం వరకు జిల్లా ఫిర్యాదుల కమిటీ (గ్రీవెన్స్ కమిటీ) పరిశీలించి తగిన ఆధారాలు, పత్రాలు చూపించిన వారికి సంబంధించి  రూ2,11,80,761 నగదు అప్పగించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బ్యారీకేడ్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు, పోలీసులు వాహనాలు, తదితరాలు తనిఖీలు చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 104 కేసులకు సంబంధించి రూ.3,49,92,241 నగదు ఉండగా అందులో 70 కేసులకు సంబంధించి సరైన ఆధారాలు, ధ్రువపత్రాలు సమర్పించిన నేపథ్యంలో గ్రీవెన్స్ కమిటీ పరిశీలించి విచారణ చేపట్టి రూ. 2,11,80,761- వారికి తిరిగి అప్పగించినట్లు తెలిపారు. అలాగే ఐదు కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కాగా అందుకు సంబంధించిన నగదు రూ.28.18 లక్షలు ఉన్నాయని అందులో సెక్యూరిటీ ఇతర దరఖాస్తులకు సంబంధించి 34 పెండింగ్లో ఉండగా అందుకు సంబంధించిన రూ. 1,09,93,480 నగదుకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలు అందచేయాల్సి ఉందని తెలిపారు. ఈ విషయంలో కేసుల విచారణ జరుగుతోందని, వాటిని సైతం త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు, పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని  ఇలాంటి వాటిలో ఎన్నికలకు సంబంధం లేని సొత్తు కూడా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో  సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్న సొత్తు  పరిశీలనకు జిల్లా ఫిర్యాదుల కమిటీ (గ్రీవెన్స్ కమిటీ) ని ఏర్పాటు చేసి అందులో జిల్లా స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించామని అన్నారు. పట్టుకొన్న నగదును అన్ని రకాల రశీదులు, తగిన సాక్ష్యాలతో తిరిగి తీసుకొనేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఎఫ్–12లో గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి  శ్రీనివాసమూర్తి ఫోన్ నెంబర్ : 9100115724,  డీటీవో నర్సింహా రావు  ఫోన్ నెంబర్ : 77999-34204, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, ఫోన్ నెంబర్ : 73309-99280 లో సంప్ర దించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *