కాంగ్రెస్‌లో సిఎం అభ్యర్థలు ఎక్కువే
మన రాష్ట్రం మీద పక్క రాష్ట్రం నాయకుల దాడి ఏంది..?
శేరి లింగంపల్లి బూత్ కమిటీల సమావేశంలో మంత్రి కెటిఆర్
బిజెపిలో యువతకు ప్రాధాన్యం లేదు….కెటిఆర్ సమక్షంలో పార్టీలో చేరిన బిజెపి నేత రాకేశ్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించుకుంటున్నారు.. చివరకు ఎన్నికల్లో పోటీలో లేని జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. పదవులు వెతుక్కుంటూ వొస్తాయని అంటున్నారని, కానీ సీఎం కుర్చీ ఖాళీ లేదు.. తమ నాయకుడు కేసీఆర్ ఉన్నడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ బూత్ కమిటీల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆరే ఉంటడు అనే మాట గట్టిగా మనందరం కూడా చెప్పాలన్నారు. మన విూద ఈ పక్క రాష్ట్రం నాయకుల దాడి ఏంది..? నాకు అర్థం కాదంటూ మండిపడ్డారు. ఓ డీకే శివకుమార్, ఇంకెవడో సిద్ధరామయ్య వీళ్లందరూ మనకు అవసరమా..? మన నాయకుడు మనకు ఉండగా, వీళ్లందరు ఎందుకు బయటోళ్లు అని కేటీఆర్ నిలదీశారు. ఈ సన్నాసులు మనకు అవసరమా..? బెంగళూరు, గుజరాత్ నాయకులు మనకు అవసరమా..? ఇక్కడ ఉండే సమస్యలను పరిష్కారం చేయలేని దద్దమ్మలు.. బీ ఫామ్స్ కోసం ఢల్లీి పోయేటోళ్లు. టికెట్ల కోసం ఢల్లీిలో తిరిగే దద్దమ్మలు మనకు ఏం న్యాయం చేస్తరు ఆలోచించండి. రేపటి రోజున కాంగ్రెసోడు, బీజేపోడు నిర్ణయం తీసుకోవాలంటే వారికి నిర్ణయాధికారం ఉండదు. మోదీ, రాహుల్ చెప్పినట్లు వింటరు. అలాంటి సన్నాసులను మళ్లీ ఒక్కసారి నెత్తిన పెట్టుకుని మళ్లీ ఆగమైదామా.. వాస్తవాలు ఏందో ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు. కాంగ్రస్ పార్టీ కరెంట్ సమస్యను పరిష్కరించలేకపోయింది. వ్యవసాయాన్ని, పరివ్రమలను నాశనం చేసింది. మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. పదవులు తప్ప ప్రజలను పట్టించుకున్నది లేదు. కొద్దిగా ఏమైతదిలే అంటే మొదటికే మోసం వస్తది ఆలోచించండి. రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. హిందూ ముస్లిం పంచాయితీ లేదు. ఆంధ్రా తెలంగాణ పంచాయితీ లేదు. కులాల పంచాయితీ లేదు.. కుంపట్లు లేవు. భారతదేశంలో ఏం జరుగుతుందో చూడండి. పార్లమెంట్‌లో ఓ ముస్లిం ఎంపీని పట్టుకుని నువ్వు ముస్లిం, ఉగ్రవాదివి అని బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారు. అలాంటి దిక్కుమాలిన పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. కులం, మతం పేరుతో మన దగ్గర దూషించుకోవడం లేదు. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎక్కడా లేడు. స్థిరమైన నాయకుడు, సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే మన నగరం బాగుంటది. మన బతుకులు బాగుంటాయి. ఎవరికి అంటే వారికి అధికారం ఇస్తే మన నగరం, బతుకులు ఆగమవుతాయి అని కేటీఆర్ సూచించారు.
బిజెపిలో యువతకు ప్రాధాన్యం లేదు….కెటిఆర్ సమక్షంలో పార్టీలో చేరిన బిజెపి నేత రాకేశ్ రెడ్డి
బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశంసించారు. బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాకేశ్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి, జనగాం అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్. వారి సారథ్యంలో ఈ రోజు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నందుకు సంతోషపడుతున్నాను. ఎంతో మంది యువ నాయకులను, ప్రజాప్రతినిధులను తయారు చేసి శరవేగంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలని, ప్రజాసేవకు అంకితం కావాలని నేను 11 ఏండ్ల క్రితం అమెరికాలో ఉన్నత ఉద్యోగం వదిలేసి వరగంగల్ గడ్డ విూద అడుగుపెట్టి, బీజేపీలో చేరాను. నాటి నుంచి మొన్నటి వరకు పార్టీయే ప్రాణంగా, కార్యకర్తలను కుటుంబ సభ్యులగా భావించి ప్రజలకు అంకితమై సేవలందించాను. ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేశాను. 6 వేల ఓట్లు ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తద అన్న స్థాయికి తీసుకెళ్లాను. బీజేపీని ప్రతి గుడిసెకు తీసుకెళ్లాను అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలో యువతకు ప్రాధాన్యం లేదు. ప్రతిభకు స్థానం లేదు. ప్రజాబలం ఉన్నటువంటి వారికి గుర్తింపు లేదు. డబ్బులు ఉన్నవారికే గుర్తింపు ఉంది. తేజస్వి సూర్యను చూపించి యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి దేశమంతా ప్రచారం చేస్తారు. తెలంగాణకు కూడా, వరంగల్ కూడా ప్రతి జిల్లాకు సూర్య కావాలని ఆలోచన లేదు. కానీ బీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో యువ నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు అయ్యారు. పనితనానికి ప్రాధాన్యం లేనటువంటి బీజేపీలో కొనసాగడం అవసరం లేదని చెప్పి రాజీనామా చేశాను. ఒక విజన్, ఎజెండా లేదు. ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయలేదు. బీజేపీ ఆదరణ కోల్పోయింది. అగ్ర నాయకులు సైతం ఇతర పార్టీలకు వెళ్తున్నారు. బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు అని రాకేశ్ రెడ్డి తెలిపారు.





