తెలంగాణ భవన్ వేదికగా కొత్త పార్టీకి శ్రీకారం
జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారనున్న టిఆర్‌ఎస్
హాజరవుతున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి
కెసిఆర్ పార్టీపై ఎపిలోనూ పలువురు నేతల ఆసక్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 4 : తెలంగాణ రాజకీయాల్లో దసరా రోజు కీలకపరిణామం చోటు చేసుకోబుతున్నది. ఉద్యమ పార్టీగా, రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణలో అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఇక దేశ రాజకీయాల్లోనూ వేళ్లూనాలని చూస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజయదశమినాడు.. బుధవారం జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు. ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేం కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సిఎం కుమరాస్వామి హాజరవుతున్నట్లు సమాచారం. నేతలకు దసరా పండగ ఇదే కానుంది. దీనికితోడు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబురాలు చేస్తామని మంత్రి శ్రీనివాసయాదవ్ ప్రకటించారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్‌ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్‌గా మార్చుతూ తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో తీర్మానిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైనా.. దసరా రోజున సర్వసభ్య సమావేశం యథావిధిగా ఉంటుందని కేసీఆర్ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఈ భేటీలోనే పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేస్తారు. మర్నాడు దానిని దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దీనిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వొచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ పేరు మార్పు •పక్రియ నామినేషన్ల నాటికి పూర్తికాదని, కనీసం నెల రోజులు పట్టవచ్చని..అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థినే పోటీకి దించుతామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.



