ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : సుప్రసిద్ధ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సి.హెచ్.వి.ఏం.కృష్ణారావు మృతి మీడియా రంగానికే కాకుండా సమాజానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియు డబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులునగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడడం కృష్ణా రావు స్వభావమన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలపైగా మీడియా రంగానికి సేవలందించడమే కాకుండా సామాజిక మేధావిగా, ప్రజల గొంతుగా విశ్లేషణలు చేసేవారని తెలిపారు. తమ సంఘంతో కృష్ణారావుకు నాలుగు దశాబ్దాలఅనుబంధం ఉందని వారు పేర్కొన్నారు. కృష్ణారావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు వారు సానుభూతిని తెలిపారు.




