జయలలిత మరణంలో అనుమానాలున్నాయి

  • సరైన సమయంలో వైద్యం అందలేదు
  • ఆపోలో వైద్యుల తీరుపైనా అనుమానాలు
  • ఆర్ముగం కమిటీ నివేదిక సమర్పణ

దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణ రహస్యంపై ఆర్ముగస్వామి నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నివేదికను బహిర్గతం చేసింది. జయలలిత మరణం సమయంలో శశికళను ఆమె దూరం పెట్టినట్టు నివేదికలో ఉంది. జయకు, శశికళకు మధ్య ఆ సమయంలో విభేదాలు ఉన్నట్టు తెలిపింది. జయలలిత మరణంలో శశికళ పాత్రపై లోతైన దర్యాప్తు అవసరమని కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జయలలితకు ట్రీట్‌మెంట్‌ ‌చేసిన డాక్టర్ల తీరును కూడా ఆర్ముగస్వామి కమిటీ తప్పుపట్టింది. అపోలో ఆస్పత్రి వర్గాలు సరైన సమాచారం ప్రజలకు ఇవ్వలేదని తెలిపింది.

అప్పటి తమిళనాడు చీఫ్‌ ‌సెక్రటరీ నేరానికి పాల్పడ్డారని వెల్లడించింది. జయలలితకు వెంటనే యాంజియోప్లాస్టీ చేయాలని నిపుణులు సూచించినప్పటికి ఆ ట్రీట్‌మెంట్‌ ‌చేయలేదని కమిటీ తెలిపింది. జయలలిత మరణం వెనుక అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు.. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 2017లో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ముగసామి కమిషన్‌ ‌గత 5 సంవత్సరాలుగా వివిధ కోణాల్లో విచారించింది. జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులతో మాట్లాడింది. ఆస్పత్రి వర్గాల నుంచి కూడా పలు వివరాలు తీసుకుంది.

కమిటీ ప్రశ్నించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇలా 158 మందిని విచారించింది కమిషన్‌. ‌చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందిన చికిత్సపై అనుమానాలు నెలకొన్నాయి. జయలలిత నెచ్చెలి శశికళ.. పార్టీ నేతలు సహా ఎవ్వరినీ జయతో కలవనివ్వలేదు. ఈ నేపథ్యంలో పలు వదంతులు రావడంతో అపోలో ఆసుపత్రి, ఆమెకు చికిత్స అందించిన ఎయిమ్స్ ‌వైద్యులను కూడా విచారించారు. అయితే జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలూ లేవని ఎయిమ్స్ ‌వైద్యబృందం ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. జయలలిత 2016లో అనారోగ్యంతో మరణించాక.. కమిషన్‌ ఏర్పాటు తర్వాత అనేక మలుపులు తిరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *