జమ్ము-కాశ్మీర్‌లో పొత్తుకు ఓకే

పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూనే ముందుకు..
లోక్‌ ‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ విశ్వాసాన్ని దెబ్బతీయగలిగాం
పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి జమ్ము-కాశ్మీర్‌లో లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పర్యటన
వీలైనంత త్వరగా జమ్ము-కాశ్మీరలో రాజ్యాధికారం, ప్రజల హక్కుల పునరుద్ధరణ పట్ల ఆశాభావం
ఒక నియంత మెజారిటీ సాధించకుండా నిలువరించడం ఇండియా కూటమి పెద్ద విజయం : ఖర్గే

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 22 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూనే జమ్మూ కాశ్మీర్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కూటమిని ఏర్పాటు చేస్తామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ గురువారం చెప్పారు. గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మలికార్జున్‌ ‌ఖర్గేతో కలిసి శ్రీనగర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాహుల్‌ ‌మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌ ‌సిద్ధాంతాలను రక్షించడానికి, పార్టీ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తమ జీవితమంతా అంకితం చేశారని అన్నారు. కార్యకర్తలు పడిన కష్టాలు తనకు తెలుసునన్నారు. వొచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు, నాయకుల గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు తారిఖ్‌ ‌హమీద్‌ ‌కర్రాకు పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది.
దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలను వేధిస్తున్న నిరుద్యోగం వంటి సమస్యలు జమ్మూ-కాశ్మీర్‌ ‌యువతను కూడా ప్రభావితం చేస్తాయని రాహుల్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ విశ్వాసాన్ని తాము దెబ్బ తీమగలిగామని, కాంగ్రెస్‌, ‌భారత కూటమి సిద్ధాంతాలే ఇందుకు కారణమయ్యాయని, ఇది గౌరవప్రదంగా జరిగిందే తప్ప తాము వారిపై ఎటువంటి చెడు పదాలు ఉపయోగించలేదని రాహుల్‌ అన్నారు. జమ్ము-కాశ్మీర్‌లో వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం కాంగ్రెస్‌ ‌పార్టీ, ఇండియా కూటమి ప్రాధాన్యత అని రాహుల్‌ ఈ ‌సందర్భంగా స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇలా చేయవచ్చని భావించినప్పటికీ…ఎన్నికలు ప్రకటించబడడం ఒక ముందడుగని, వీలైనంత త్వరగా రాజ్యాధికారం, ప్రజల ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరించబడతాయని తాము ఆశిస్తున్నామన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా స్థాయిని తగ్గించడం ఇదే తొలిసారని రాహుల్‌ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ ‌మరియు లడఖ్‌ ‌ప్రజలకు లభించే ప్రాధాన్యత విషయమై తమ జాతీయ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా పొందుపరిచామని, వారి ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రాహుల్‌ ‌తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్‌ ‌నాయకుడు కె సి వేణుగోపాల్‌తో కలిసి జమ్ము-కాశ్మీర్‌ ‌ప్రజలకు తమ పార్టీ చేయగలిగినంత సహాయం చేస్తుందని రాహుల్‌ ‌హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని, ప్రజలు చాలా కష్టమైన కాలంలో జీవితాలన్ని వెళ్లదీస్తున్నారని తాము అర్థం చేసుకున్నామని అన్నారు. తాము హింసను నిర్మూలించాలనుకుంటున్నామని రాహుల్‌ అన్నారు. ఎన్నికలు ప్రకటించిన తర్వాత కార్యకర్తలతో ఇది మొదటి సమావేశమని, ఎన్నికలు మరియు పొత్తు కోసం స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు తాము జమ్ము-కాశ్మీర్‌కు వొచ్చామని మల్లిఖార్జున్‌ ‌ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో అందరినీ తన వెంట తీసుకెళ్లేందుకు రాహుల్‌ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఒక నియంత మెజారిటీ సాధించకుండా ఆపడం ఇండియా కూటమి యొక్క పెద్ద విజయమని ఖర్గే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *