జనాభా పెరుగుదల- ఒక విశ్లేషణ

నేడు  ప్రపంచ జనాభా దినోత్సవం

క్కడ చూసినా జనం.పల్లెలు,పట్టణాలు,నగరాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.హోటళ్ళు, సినిమా హాళ్ళు,షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్లు,హాస్పిటల్…ఇలా ఒకటేమిటి బ్యాంకుల నుండి బట్టల దుకాణాల వరకు  ఎక్కడ చూసినా జనం. ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో ప్రతీ ప్రాంతం కిటకిట లాడుతున్నది. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగిన జనాభా వలన పలు ప్రపంచ దేశాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించ లేక సతమతమవుతున్నాయి.విద్య,వైద్యం,ఆరోగ్యం, త్రాగునీరు, పారిశుధ్యం వంటి అనేక అంశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నాయి. గృహకల్పన,నిరక్షరాస్యత, నిరుద్యోగం, పౌష్ఠికాహారం, ఉద్యోగ కల్పన వంటి అంశాలు విషమ సమస్యలు గా మారాయి. ప్రకృతి వైపరీత్యాలతో అనేక దేశాలు సతమతమవుతున్నాయి.చాలా దేశాల్లో ఈనాటికీ కనీస విద్య  గగన కుసుమంలా మారింది. ఆహార సమస్యతో అనేక దేశాలు అలమటిస్తున్నాయి. కోవిడ్ ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను తల్లక్రిందులు చేసింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోల పరిస్థితులు సమసిపోతున్న తరుణంలో రష్యా- ఉక్రెయిన్ల మధ్య తలెత్తిన యుద్ధంతో  ప్రపంచం ఒక భయానక ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నది. అగ్రరాజ్యాలు సైతం ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక అధిక జనాభా గల దేశాల ఆర్ధిక సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజల అవసరాలకు తగిన వనరులు లేకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసుకుంటూ పోతే ఇక భవిష్య తరాల భవితవ్యం ప్రశ్నార్ధకమే.ఇకనైనా ప్రపంచ జనాభా పెరుగుదల గురించి ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలు కూలంకషమైన అధ్యయనాలు జరిపి, జనాభా పెరుగుదల వలన తలెత్తుతున్న సమస్యలను విశ్లేషించి, భవిష్యత్తులో ఎదురయ్యే విపత్కర పరిణామాలపై దృష్టి సారించాలి. కుల,మత బేధాలకు సంబంధం లేకుండా జనాభా పెరుగుదల విషయంలో ప్రతీ ఒక్కరూ దృష్టి సారించాలి.

పూర్వకాలం నాటి పరిస్థితులు వేరు,ఇప్పటి పరిస్థితులు వేరు.అప్పట్లో పదిమంది వరకు సంతానంతో పెద్ద పెద్ద కుటుంబాలు మనుగడలో ఉండేవి. అయినప్పటికీ జనాభా తక్కువగానే ఉండేది. ప్రకృతి విపత్తుల వలన, అంటువ్యాధుల వలన ఊళ్ళకు ఊళ్ళే తుడిచిపెట్టుకు పోయిన సందర్భాలున్నాయి.మశూచి,ప్లేగు వంటి మహమ్మారుల వలన ప్రపంచంలో కొన్ని దేశాలు కోట్ల సంఖ్యలో జననష్టం చవి చూసాయి. సాంకేతిక పరిజ్ఞానం, విద్య ఆరోగ్య రంగాలు,రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడంతో  ప్రజలకు ఆరోగ్య వంతమైన జీవన విధానం అందుబాటులో ఉండేది కాదు.  అప్పట్లో నూరు సంవత్సరాలకు పైగా జీవించిన వారున్నారు. తీవ్రమైన అంటువ్యాధుల వలన  చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అధిక సంఖ్యలో మరణించిన వారున్నారు. అందువలన కుటుంబ నియంత్రణ పాటించక పోయినా,మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో జనాభా కూడా పరిమిత సంఖ్యలో ఉండేది. అయితే నేడు అలాంటి పరిస్థితులు లేవు. ప్రజల్లో విజ్ఞానం పెరిగింది. ఆలోచనా పరిధి విస్తృతమైనది. సాంకేతిక పరిజ్ఞానం, విద్య,వైద్య సదుపాయాలు పెరిగాయి. రోగాలనుండి కాపాడే మందులు,రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్ లు  ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రోడ్డు,రైల్వే సదుపాయాలతో పాటు,విమాన సౌకర్యాలు అందుబాటు లోకి రావడం, వైద్య రంగం ప్రజలకు చేరువ కావడంతో ప్రజల ఆయుః ప్రమాణం పెరిగింది. అర్ధాంతర మరణాలకు చాలా వరకు అడ్డుకట్ట వేయబడింది.ఈ కారణంగా జననాల సంఖ్య పెరిగినా  మరణాల సంఖ్య తగ్గింది. కుటుంబ నియంత్రణ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అనే నినాదంతో విద్యావంతుల నుండి విద్యా విహీనుల వరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ మార్గాలను పాటిస్తున్నారు.ఇదే సందర్భంలో కొన్ని దేశాలు జనాభా పెరుగుదల అరికట్టడం కోసం పటిష్ఠమైన కుటుంబ నియంత్రణ అమలు చేయడం వలన  వృద్ధుల సంఖ్య బాగా పెరిగి, యువతీ యువకుల సంఖ్య తగ్గడంతో,అభివృద్దికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి .చైనా ఇందుకు ఉదాహరణ. జనాభా పెరుగుదల నియంత్రించడానికి కఠిన నిబంధనలు అమలు పరచి, చివరికి అక్కడ యువతరం తగ్గి, వృద్ధతరం పెరిగి పోవడంతో జనాభా విషయంలో గతంలో విధించిన నిబంధనలను ఉపసంహరించుకుంది.

      మన దేశం జనాభాలో ఇటీవల ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది. ప్రపంచంలో ఏర్పడిన కొన్ని పరిణామాల దృష్ట్యా  జనాభా నియంత్రణ విషయంలో కొన్ని దేశాలు వెనకడుగు వేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఒకరు లేదా ఇద్దరు అనే నినాదానికి స్వస్తి వాక్యం పలికే దిశగా పయనిస్తున్నాయి. వృద్ధులు,మధ్య వయస్కుల  సంఖ్య పెరగడం, యువత సంఖ్య తగ్గడం వలన పని చేసే శక్తి సామర్థ్యాలు, ప్రగతికి జవసత్వాలు చేకూర్చి, ఆర్ధికంగా బలిష్టమైన వ్యవస్థల రూపకల్పనలో  ఏర్పడిన అవాంతరాలను అధిగమించడానికి, యువశక్తిని నిజమైన మానవ వనరులుగా భావించి, అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగడానికి మార్గం సుగమం చేయాలనే లక్ష్య సాధన కోసం వివిధ దేశాలు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు సరిపడా వనరులు లేని దేశాలు, ఆర్ధికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న దేశాలు జనాభా పెరుగుదల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవాలి.యువజనానికి తగినంత ప్రాధాన్యత నిస్తూనే, జనాభా పెరుగుదలను అరికట్టాలి. ఇందుకు తగిన మార్గాలను అన్వేషించాలి. జనాభా విస్ఫోటనం వలన అనర్ధాలే తప్ప ఏ దేశానికీ ఒరిగేదేమీ ఉండదు.  ఇకనైనా ప్రపంచ దేశాలన్నీ హేతుబద్ధమైన ఆలోచనలతో ప్రపంచ జనాభా పెరుగుదలపై స్పష్టమైన వైఖరి అనుసరించాలి.  జన సంఖ్య పెరుగుతూ పోతే వనరుల కొరతతో, జీవించడానికి కనీస సౌకర్యాలు లేక   భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి.ప్రపంచంలో ప్రస్తుత జనాభా 8 బిలియన్లు దాటింది.40 శాతం పైగా  మహిళలు,బాలికలు ఈనాటికీ లింగ వివక్షత ఎదుర్కొంటున్నారు. సమాన విద్య,ఉపాధి అవకాశాలు లేక అలమటిస్తున్నారు.మహిళల పట్ల  సాగుతున్న హింస, లైంగిక దాడులు, హత్యల వలన మహిళల పురోభివృద్ధిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.
       ప్రపంచంలో పలు దేశాల ప్రజలు అనేక రంగాల్లో లింగ వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ఈ ధోరణి మారాలి. స్త్రీశక్తిని ఇంటికే పరిమితం చేయకుండా పురుషులతో సమానంగా పూర్తి స్థాయిలో ఎదగనిస్తే, యువతులను కూడా యువకులతో సమానంగా ప్రోత్సహించి,అభివృద్దిలో భాగస్వామ్యం కల్పిస్తే సత్ఫలితాలు రాబట్టవచ్చు.  వృద్దుల సంఖ్య పెరిగి పోతున్నదని చింతించడం కంటే యువతులకు కూడా ఆయా దేశాల అభివృద్ధిలో తగిన భాగస్వామ్యం కల్పించాలి.  జనాభా పెరుగుదలను అరికడుతూనే యువత సంఖ్య తగ్గకుండా చూడాలి. లింగ వివక్షత ప్రదర్శించకుండా యువజనంలో యువకులకే కాకుండా యువతులకు కూడా తగిన ప్రోత్సాహం కల్పించి  ముందుకు సాగాలి.ఇండియా 142 కోట్ల జనాభాను దాటి,చైనా కంటే స్వల్ప తేడాతో ప్రపంచ జనాభాలో మొదటి స్థానం ఆక్రమించింది, చైనా 142 కోట్ల తో,అమెరికా 33 కోట్లతో, ఇండోనేషియా 27కోట్లకు పైగా,పాకిస్థాన్ 23కోట్లతో  జనాభాలో  మొదటి ఐదు స్థానాలను ఆక్రమించాయి.  బ్రెజిల్ ,నైజీరియా,బంగ్లాదేశ్,రష్యాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. జనాభా పెరుగుదల అభివృద్ధి పై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నమాట యథార్థం.ఏదైనా ఒక నిర్ధిష్ఠ  ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే “జనాభా” అని నిర్వచించవచ్చు. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభా సంఖ్యను జనసాంద్రత అంటారు. ఈ జనసాంద్రతను బట్టే ఆయా దేశాల అభివృద్ధిని అంచనా వేయవచ్చు.అధిక జనసాంద్రత గల దేశాలు జనాభా పెరుగుదలను నియంత్రణ చేయకపోతే చాలా కష్టం.  ఎక్కువ భూభాగం కలిగి తక్కువ జనసాంద్రత గల దేశాల్లో జనాభా పెరగడం వలన నష్టమేమీ లేదు. అయితే అలాంటి దేశాల్లో కూడా సారవంతమైన పంటభూములు, సహజ వనరులు లేకపోతే అవి కూడా ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. అవిద్య,ఆకలి,దరిద్రం వంటి కష్టాలతో నిరంతరం బాధపడే దేశాలు జనాభాను అదుపులో పెట్టడం మంచిది. పది మందికి సరిపడే ఆహారాన్ని వందమంది తిని, క్షుద్భాధ అనుభవించే కన్నా, పది మంది ఆకలి తీర్చుకోవడం మిన్న. అందుకే మనకు లభ్యమౌతున్న వనరులను,ఉపాధి అవకాశాలను, ఇతర సదుపాయాలను అంచనా వేసుకుని జనాభా పెరుగుదలను నియంత్రణ చేయాలా? వద్దా అని నిర్ణయించుకోవాలి. ప్రపంచ జనాభా ఇలా పెరుగుతూ పోతుంటే భవిష్యత్తులో తీవ్రమైన ఆహార సమస్య ఏర్పడే అవకాశాలున్నాయి.  రాబోవు పరిణామాలను విజ్ఞతతో ఆలోచించి జనాభా పెరుగుదలపై పూర్తిస్థాయి మేథోమధనం జరగాలి.
  – సుంకవల్లి సత్తిరాజు.
                 (సామాజిక విశ్లేషకులు)
                    మొ:9704903463.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *