హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన సీట్లను అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 సీట్లు కేటాయించాలని తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక కన్వీనర్ జమలపురం శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానని, మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ను తనకే కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 శాతం బ్రాహ్మణులున్నారని చెప్పారు. భారత రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రసాదించిన రాజకీయ, సామాజిక హక్కులను బ్రాహ్మణులందరికీ సంపాదించడానికి అన్ని బ్రాహ్మణ ఉపకులాలతో ‘తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో శాసన సభ ఎన్నికల వల్ల రాజకీయ వేడి రాజుకుంటున్న నేపథ్యంలో బ్రాహ్మణులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 లక్షల మంది బ్రాహ్మణులు నివసిస్తున్నారని తెలిపారు. సమాజ హితం కోరుకునే బ్రాహ్మణ సామజిక వర్గంను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. బ్రాహ్మణ ఉపకులాలను గుర్తించి నామినెటేడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కో-కన్వినర్లు చంద్రమోహన్, రాజేశ్వరి, సభ్యులు గూడు రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
జనాభా దమాషా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి



