జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

 జయంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఎప్రిల్‌ 4 : స్వాతంత్య్ర సమరయో ధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నేడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన జాతికి చేసిన సేవలను సీఎం రేవంత్‌ స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జన్మించిన జగ్జీవన్‌రామ్‌ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగ పరిషత్‌ సభ్యునిగానూ సేవలందించారని, స్వాతం త్య్రానంతరం తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ సేవలు అందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా కరువు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అంటరాని తనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని సీఎం పేర్కొ న్నారు. జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలను కొనసాగిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *