- పాలమూరు ప్రజలు జెండాలను పక్కన బెట్టి కాంగ్రెస్ను గెలిపించాలి
- అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ
- నెలకు రూ. 4 వేల పెన్షన్…జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్లో చేరిన నాగర్ కర్నూల్, అచ్చంపేట బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనుల జీవితాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సోమవారం నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి..ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామన్నారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు మీరు గెలిపిస్తే రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. గ్రామ గ్రామాన తిరగండి…ప్రతీ తలుపు తట్టండి…బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండని ఈ సందర్భంగా సార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరగబడదాం..తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన వెంటనే పాలమూరు జిల్లాలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.




