చేతకాకుంటే రేవంత్‌ రాజీనామా చేయాలి

  • సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా  
  • ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టండి..
  • రైతులకు నష్టం కలగకుండా చూడండి
  • కాళేశ్వరం కింద నీళ్లు పారింది 98 వేలకు కాదు.. 20 లక్షల ఎకరాలకు
  • తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నీళ్లు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా కూడా ఆ చర్యలు చేపట్టడం లేదని, వాళ్లకు చేతకాకపోతే రేవంత్‌ను రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తానని హరీష్‌ రావు చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండితే.. తమ హయాంలో మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండినయని, మ్యాజిక్‌ చేస్తేనో, మంత్రమేస్తనో పండుతాయా..? అంటూ ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వానికి మంచి పేరు వొచ్చింది కనుక దాని మీద బురద జల్లాలి. ఏదో ఒక రకంగా మాకు చెడ్డ పేరు తెచ్చి, ప్రజల్లో అనుమానాలు కలిగించే విధంగా దుష్ప్రచారానికి వాళ్లు పాల్పడుతున్నారు.

కానీ నిజం నిలకడ మీద తెలుస్తది. మేం రిజర్వాయర్లు నింపి పెట్టినం కనుక యాసంగికి నీళ్లు పోతున్నాయి ఇబ్బంది లేదు. వచ్చే యాసంగికి నీళ్లు రాలేదు అనుకో. కేసీఆర్‌ ఉండంగ నీళ్లు వొచ్చినయ్‌.. ఇప్పుడు ఎందుకు వొస్తలేవు అని ప్రజలు ఆలోచించరా..?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. అదే విషయాన్ని ఇంజినీర్లు కూడా చెబుతున్నారు. వాళ్లకు చేతకాకపోతే మాకు ప్రభుత్వాన్ని అప్పజెప్పమనండి. మేం చేసి చూపిస్తాం. రేవంత్‌ రెడ్డిని రాజీనామా చేయమను. నేను ఎక్కి చేపిస్తా. రేవంత్‌ను దిగమను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తా. నాకు మద్దతు ఇస్తా అంటే ఐయామ్‌ రెడీ టు టేక్‌ ఇట్‌. ఆయనకు చేతకాదు.. హరీశ్‌రావు నీవు చేయ్‌ అంటే చేసి చూపిస్తా. రైతులకు నష్టం కలగకుండా పునరుద్ధరణ చర్యలు చేపట్టమని కోరుతున్నాం..అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఎవరు ఎన్నేండ్లు ముఖ్యమంత్రి ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెబుతున్నాం. మీరు బాగా చేస్తే ఆదరిస్తారు.. లేదంటే బండకేసి కొడుతారు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి కేసీఆర్‌ను కాల్చేయాలి, ఉరితీయాలని మాట్లాడిరడు. ఆయన అలా మాట్లాడొచ్చా..?.. అని హరీష్‌ రావు అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్‌ పెరిగిందని, దానికేదో మేం కారణమన్నట్లు కాంగ్రెస్‌ బురదజల్లడం సరికాదని  సూచించారు. ఈ విషయంపై వివరణ ఇద్దామంటే మాకు అసెంబ్లీలో మైక్‌ ఇవ్వడం లేదు.. గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. సభలో అవకాశం ఇవ్వకపోతే మీడియా పాయింట్‌కు వెళ్దామంటే అడ్డుకున్నారు. మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని హరీష్‌ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేసి రెండు పంటలకు నాలుగన్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. కాంగ్రెస్‌ హయాంలో ఒక్క చుక్క నీరు రాలేదు.

కాళేశ్వరం నీళ్లతో పంటలు కాపాడుకున్న పరిస్థితి. వాస్తవానికి కొత్త ఆయకట్టు కానీ, చెరువుల కింద వచ్చిన ఆయకట్టు కానీ, స్థిరీకరణ చేసింది కలిపితే మొత్తం 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది కాళేశ్వరం ద్వారా. ఈ వాస్తవాన్ని మరుగున పెట్టి కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది.. అని హరీష్‌ రావు పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ఓ రెండు, మూడు ఎంపీ సీట్ల కోసం వరద, బురద రాజకీయాలకు పాల్పడుతుందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మొత్తం ప్రాజెక్టను డ్యామేజ్‌ చేయాలని దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. అని తాము అసెంబ్లీలో ఇప్పటికే చెప్పామన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని మేం అసెంబ్లీలో చెప్పాం. దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పాం. కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని కోరాం. కానీ ప్రభుత్వం పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా దుష్ట రాజకీయాలకు పాల్పడుతుంది…అని విమర్శించారు హరీష్‌ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *