సిఎం కేసీఆర్‌పై విరుచుకుపడిన బిజెపి లీడర్ విజయశాంతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6: సిఎం కేసీఆర్‌పై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్కార్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోన్న కేసీఆర్ చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విజయశాంతి సిఎం కేసీఆర్‌ను డిమాండు చేశారు. ఆమె బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ.. కార్పొరేట్ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోందనీ ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 20వేలకు పైగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పేందుకు సరిపోను సార్లు లేరనీ, వేల బడుల్లో ఒకరిద్దరు టీచర్లతోనే విద్యాబోధన జరుగుతోందన్నారు. ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడంతో టీచర్ల అవసరం మరింత పెరిగిందనీ, సమస్య తీవ్రత దృష్ట్యా టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేపట్టాల్సిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు. టెట్ ముగిశాక 14 వేల ఉపాధ్యాయ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తమని విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పలుమార్లు ప్రకటించారన్నారు.
కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం పేర్కొన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇవ్వలేదనీ, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే.. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి, నోటిఫికేషన్ విడుదల, పరీక్ష, ఫలితాల ప్రకటన పూర్తయ్యేసరికి ఈ ఏడాది గడుస్తుందన్నారు. టీచర్లు లేకుండానే విద్యార్థులుపై తరగతులకు ప్రమోట్ కావాల్సి వస్తుందనీ, రాష్ట్రంలో చివరిసారిగా 2017 జులై 23న ప్రభుత్వం టెట్ నిర్వహించిందనీ, అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పుతో 2017 అక్టోబర్ 22న 8,792 టీచర్ పోస్టుల ఖాళీలకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఆ తర్వాత దాదాపు మళ్లీ ఐదేండ్లకు గత నెల 12న టెట్ నిర్వహించిందనీ, ఇలా కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ.. వారి జీవితాలతో ఆడుకుంటోందనీ మండిపడ్డారు. ఇటీవల గురుకుల పాఠశాల్లలో 9 వేల ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా.. ఆ పోస్టులకు టెట్‌తో సంబంధం లేదనీ, అయినా కూడా కేసీఆర్ సర్కార్ ఆ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. దీన్ని బట్టి అర్థం అవుతోంది… కేసీఆర్ సర్కార్‌కు విద్యా వ్యవస్థపై ఎంత చిత్త శుద్ధి ఉందో.. కేసీఆర్… ఇప్పటికైనా చిల్లర రాజకీయాలను పక్కన పెట్టి టీచర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌కు విద్యార్థి లోకం తగిన గుణపాఠం చెబుతుందనీ ఆ పత్రికా ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు.




