చిటికెడు దాటితే చిక్కులే…!

‘అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు’ అంటూ గర్వంగా సవాళు విసురుతుంది వంటలో వాడే ఉప్పు. వంటల్లో వాడే ఉప్పు లేదా లవణాన్ని రసాయనికంగా ‘సోడియం క్లోరైడ్‌’ అని పిలుస్తాం. దీనినే టేబుల్‌ సాల్ట్‌ అని కూడా ముద్దుగా పిలవడం జరుగుతోంది. అన్ని రకాల కూరల్లో ఉప్పు వాడడం తప్పనిసరి అని మనకు తెలుసు. చాలా మందికి ఉప్పు తగ్గితే ముద్ద దిగదు. కూరలకు రుచిని జోడిస్తుంది లవణం. మనం తినే ఆహార పదార్థాల్లో కూడా ఉప్పు ఉంటుందని తెలుసుకోవాలి. మనం తినే వివిధ ఆహార పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉన్న వాటిని గుర్తు పట్టగలగాలి.

ఉప్పు వినియోగ పరిమితులు    
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు ప్రకారం ప్రతి రోజు ఒక్కొక్కరు 5 గ్రామ్‌లకు మించకుండా లవణాన్ని వినియోగించుకోవాలి. ప్రపంచ మానవాళి సగటున రోజుకు తలసరి 10.8 గ్రాముల వరకు ఉప్పును వాడుతున్నట్లు తేలింది. భారతీయ పురుషులు సగటున రోజుకు 8.9 గ్రాములు, మహిళలు 7.1 గ్రాములు తింటున్నారని అధ్యయనాలు వివరిస్తున్నాయి. అమెజాన్‌ అడవుల్లో నివసించే ‘యనోమమీ’ జాతి పౌర సమాజం తమ వంటల్లో ఉప్పును ప్రత్యేకంగా వాడనప్పటికీ లేదా రోజుకు 1 గ్రామ్‌ కన్న తక్కువ వినియోగించినప్పటికీ వారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని తేలింది. సలాడ్స్‌, పండ్ల ముక్కలు, ఉడికించిన కూరగాయల ముక్కలకు ఉప్పును చల్లరాదు. కూరలు, పెరుగన్నంలో లవణం వాడకపోతే లేదా అతి తక్కువగా వాడితో మంచిది. వంటల్లో క్రమంగా ఉప్పు వినియోగాన్ని తగ్గించడంతో మంచిది. పాపడ్స్‌, సాసులు, కెచప్‌లు, సాల్టెడ్‌ బిస్కెట్లు, పచ్చళ్లలో అధిక శాతం ఉప్పు ఉంటుందని గమనించాలి. బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, మోనో సోడియం గ్లుటమేట్‌ లాంటి పదార్థాల్లో కూడా సోడియం ఉన్నందున వాటి వాడకాన్ని కూడా తగ్గించాలి. చపాతీ, రైస్‌ తయారీలో ఉప్పును వాడరాదు.

ఉప్పుతో రోగాల పుట్టలు
ఉప్పును అధికంగా వాడే అలవాటు ఉన్న వారిలో మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి, మెదడు, రక్తనాళాలు, వ్యాధినిరోధకశక్తి లాంటి తీవ్ర అనారోగ్యాలు కలుగుతాయి. అధిక లవణం వినియోగించడం వల్ల సాలీనా 5 మిలియన్ల మరణాలు నమోదు అవుతున్నట్లు తేలింది. అవసరం కన్న ఉప్పును అధికంగా తీసుకునే వ్యక్తులకు బిపీ, గుండె జబ్బులు వస్తాయి. చిన్న పిల్లలు తినేచిప్స్‌ లాంటి ప్యాకెట్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌, నూడుల్స్‌ వల్ల స్థూలకాయం ఆవహిస్తున్నది. శరీరంలో ఉప్పు పెరిగితే జీవక్రియ మందగించి దేహంలో కొవ్వు, బరువు పెరుగుతాయి. ఉప్పును దినసరి 5 గ్రామ్‌లు వాడితే బిపీ, గుండె జబ్బులు తగ్గుతాయి. భారతీయుల మరణాల్లో 28.1 శాతం వరకు గుండె సంబంధ వ్యాధులతో జరుగుతున్నట్లు తేలింది. గుండె సంబంధ రోగాలకు ప్రధాన కారణం బిపీ అని, ఉప్పు అధికంగా తీసుకున్నట్లైతే ఈ అనారోగ్యాలు పెరుగుతాయని తెలుసుకోవాలి.

ఉప్పుకు ప్రత్యామ్నాయ మార్గాలు
సాధారణ ఉప్పుతో పాటు పొటాషియం క్లోరైడ్‌ను కలిపి వాడడం కూడా ఉత్తమ మార్గమని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. సాధారణ లవణం అనగా సోడియం క్లోరైడ్‌ 75 శాతం, పొటాషియం క్లోరైడ్‌ 25 శాతం కలిపి వాడడంతో పలు అనారోగ్యాలు దూరం అవుతాయి. ఓఆర్‌ఎస్‌ మిశ్రమంలో కూడా 60 : 40 నిష్పత్తిలో ఉప్పు, పొటాషియం క్లోరైడ్‌ వాడుతున్నారు. ఉప్పును పూర్తిగా తగ్గించినా ప్రమాదమే అని గమనించాలి. వృద్ధులు ఉప్పు వినియోగం పట్ల వైద్యుల సలహాలు పాటించాలి. బిపీ రుగ్మతతో బాధ పడే జనులు ఉప్పు వాడకం పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి.

రోజుకు 8 – 10 గ్లాసుల నీరు తాగినపుడు కూడా అధిక సోడియం శరీరం నుంచి బయట పడుతుంది. దినసరి 5 గ్రామ్‌ల లవణాన్ని తీసుకునే వారిలో బిపీ 25 శాతం తగ్గుతుందని తెలుసుకోవాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం రోజుకు 5 గ్రామ్స్‌ తీసుకోవలసిన ఉప్పును భారతీయులు 8.0 గ్రామ్‌లు తీసుకుంటూ పలు తీవ్ర అనారోగ్యాల వలయంలో చిక్కుక్కుంటున్నారు. భారతీయ ఉద్యోగులు, పొగాకు అలవాటు ఉన్న వారిలో ఉప్పు వాడకం అధికంగా ఉన్నట్లు తేలడం మనకు హెచ్చరిక కావాలి. అధిక ఉప్పు ప్రాణాంతకమని, ఉప్పును అదుపులో పెడితేనే అనారోగ్య తిప్పలు తొలుగుతుందని జ్ఞానోదయం కావాలి. తెలిసి కూడా లవణాన్ని అధికంగా వాడితే ప్రాణాంతకంగా మారుతుందని గమనించాలి. ఉప్పును పరిమితంగా వాడుతూ, ఆరోగ్యాన్ని మన చేతుల్లో నియంత్రించుకుందాం.

డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
 కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *