నేడు ఇందిరా గాంధీ వర్ధంతి, జాతీయ సంకల్పదినం
ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దం డులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తు లుగా భావిస్తున్నారు. కాని ఆ ఇరువురు నేతలను జాతికి చెందిన మహోన్నత సంప దగా భావించలేక పోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ ఇందిరా గాంధీ, సర్ధార్ పటేల్ లు భారత దేశానికి అందించిన సేవలు నిరుపమానం. స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి మహిళా ప్రధానమంత్రి గా పని చేసి, విశేష ఖ్యాతి నార్జించారు.
దేశం గర్వించదగిన వీరమహిళలు ఎంతో మంది భరత భూమిపై జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచి, చరిత్రలో తమస్థానాన్ని సుస్థిరం చేసుకు న్నారు. ఏరంగంలోనైనారాణించాలంటే ఆయా రంగాల్లో కనబరిచే ప్రతిభతో కూడిన విశేషమైన కృషి, పట్టుదల మాత్రమేపేరు ప్రఖ్యాతులకు సంపాదించి పెడుతుంది. భారత దేశంలో ఒకప్పుడు మహిళలు సాంప్ర దాయాల ముసుగులో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు దూరంగా బ్రతుకీడ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తమదైన శైలిని ప్రదర్శించి, ఎన్నో అడ్డంకులను అధిగమించి ,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికరంగాల్లో రాణించి, దేశ ఖ్యాతిని నలు చెరగులా విస్తరింప చేసారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఇందిరా గాంధీ స్థానం ప్రత్యేక మైనది. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం ఇందిరాగాంధీ రాజకీయ ఎదుగుదలకు కొంతవరకు కారణం కావచ్చు నేమో కాని, రాజకీయాల్లో నిలదొక్కుకో వడానికి కేవలం ఆమె ప్రతిభా సామర్ధ్యాలే ప్రధాన భూమిక పోషించాయి.పరిపాలనలో ఆమె చూపిన తెగువ, దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంస నార్హం.
నాటి రాజకీయాల్లో అనేక మంది ఉద్దండుల మధ్య, తలలు పండిన రాజనీతిజ్ఞుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం సాధారణమైన విషయం కాదు. అసాధారణ ప్రజ్ఞతో, అనన్య సామాన్యమైన కృషితో, అతిరథ, మహారథులను నిలువరించి,భారత రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషించి,నెహ్రూ తర్వాత అత్యధిక కాలం భారత దేశానికి ప్రధానిగా పని చేసి, దేశానికి మూడో ప్రధానిగా,మొదటి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, ధైర్య సాహసాలకు మారు పేరుగా నిలిచి,అమ్మగా జనం గుండెల్లో స్థానం సంపాదించిన ఇందిరా గాంధీ రాజకీయ చరిత్రనుఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. అలహాబాద్ లో పుట్టి,హస్తినకు ఏలికై,చిన్నతనంలోనే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టి, జైలులో నుండి నెహ్రూ పంపే ఉత్తరాల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దుకుని, దాదాపు 16 సంవత్సరాల పాటు భారత దేశ ప్రధానిగా దేశ ఔన్నత్యానికి,దేశ సమైక్యతకు పాటుబడి, ఒకానొక సమ యంలో ఇండియా అంటే ఇందిర,ఇందిర అంటే ఇండియా అనే విధంగా జన హృదయాల్లో చోటు సంపాదించుకుని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ వనిత ‘‘ఇందిరా గాంధీ’’. రాజకీయాలను సమగ్రంగా వంట బట్టించుకుని, మహామహులనుకున్న వారిని రాజకీయంగా మట్టి గరిపించి,తన శక్తి సామర్థ్యాలతో, ధైర్య సాహసాలతో భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన ధీర వనిత ఇందిర. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగిన పోటీలో విజయం ఇందిరాగాంధీ నే వరించింది.ఇందిర మంత్రివర్గంలో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా పని చేసారు. కేవలం ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా సన్న,చిన్నకారు రైతులమన్ననలు పొందడమే కాకుండా, సామాన్యులకు సైతం బ్యాంకు సేవలు అందుబాటు లోకి రావడానికి ఇందిర చూపిన చొరవ ప్రశంసనీయం. ‘‘గరీభీ హఠావో’’ నినాదం ద్వారా పేద ప్రజలకు దగ్గరైన ఇందిర, వారి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు రావడం జరిగింది.
ఆర్థిక దోపిడీని అరికట్టడం కోసం, నల్లధనం వెలికితీతకు ప్రయత్నించడం, పరిశ్రమ లను ప్రోత్సహించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, విద్య, వైద్య సదుపాయాల పెంపు కోసం, ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగు పరచడం కోసం, పేదరిక నిర్మూలన కోసం ఆమె ప్రవేశ పెట్టిన 20 సూత్రాల ఆర్థిక పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. రాజభరణాల రద్దు ఇందిరా గాంధీ తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం. ఇందిరాగాంధీ హయాంలో 1974 మే 18 వ తేదీన ఫోఖ్రాన్‌లో జరిగిన మొట్టమొదటి అణుపరీక్ష ప్రపంచానికి, శతృదేశాలకు భారత్ సత్తా ఏమిటో నిరూపించింది. ’’బంగ్లాదేశ్ ఆవిర్భావం ’’ఇందిరాగాంధీ సాధించిన విజయాల్లో అత్యంత ప్రధానమైనది. భారత్-పాకిస్థాన్ విభజన తర్వాత పాక్ నుంచి తూర్పు బెంగాల్ విడిపోయి ‘‘బంగ్లాదేశ్’’గా అవతరించింది. బంగ్లాదేశ్ అవతరణలో ఇందిరా గాంధీ పాత్ర అత్యంత సాహసోపేతమైనది. అగ్రరాజ్యాల జోక్యం లేకుండా 13 రోజుల పాటు సాగిన భారత్- పాక్ యుద్ధంతో 1971 లో బంగ్లాదేశ్ ఆవిర్బ Ûవించింది. 1971లో భారత్- పాక్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ చూపించిన నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలకు మెచ్చి అటల్ బిహారీ వాజ్ పాయ్ వంటి రాజ నీతిజ్ఞుడు సైతం, తన ప్రత్యర్థి ఇందిరను ‘‘అపర కాళి’’ గా అభివర్ణించడాన్ని మరవకూడదు.1975 లో దేశ అంతర్గత సంక్షోభం పేరుతో ఇందిరా గాంధీ సుమారు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించడం జరిగింది.ఎమర్జెన్సీ సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, జార్జి ఫెర్నాండెజ్, మధు దండావతే, వాజ్ పాయ్,ఎల్.కె. అద్వానీ,చరణ్ సింగ్ వంటి మహా మహులను జైలులో నిర్భంధించడం జరిగింది.
ఎమర్జెన్సీ కారణంగా ఇందిరా గాంధీ ప్రతిష్ట మసక బారడంతో తుదకు ఎమర్జెన్సీ ఎత్తి వేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచడంతో 1977 లో లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతా పార్టీ కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకుంది. జనతా పార్టీలో ఏర్పడిన కుమ్ము లాటల ఫలితంగా ఆ ప్రభుత్వం స్వల్ఫ కాలంలోనే అధికారం కోల్పోయింది. ఇందిరా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 1980 లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మ్రో గించింది. అప్పటి నుండి మరణించే వరకు ఇందిరాగాంధీ ప్రధా నిగా అధికారంలో కొన సాగడం జరిగింది. ఎన్నో మలుపులు, ఎన్నో కుదుపులు, మరెన్నో దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు తలనొప్పిగా మారి, తీవ్రవాద సమస్య తలెత్తిన తరుణంలో పంజాబ్ లో ‘‘బింద్రన్ వాలే’’ సారథ్యంలో ఖలిస్థాన్ వేర్పాటు వాద ఉద్యమం చెలరేగింది. పాక్ మద్ధతుతో పంజాబ్ ను దేశం నుండి విడగొట్టడానికి సాగిన ఖలిస్థాన్ వేర్పాటు వాద ఉద్యమం చిలికి చిలికిగాలి వానలా మారి, దేశ సమగ్రతను ప్రశ్నార్ధకం చేసింది. సిక్కులకు అత్యంత పవిత్రమైన అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకుని ఉగ్రవాదులు తమ కార్యకలా పాలను కొనసాగించడం జరిగింది. మార్గాంతరం లేని పరిస్థితుల్లో ఇందిరా గాంధీ ఉగ్రవాదుల ఏరివేతకు ‘‘ఆపరేషన్ బ్లూస్టార్’’ పేరుతో స్వర్ణ దేవాలయం లో తిష్ఠ వేసిన ఉగ్రవాదుల ఏరివేతకు మిలటరీ చర్య తీసుకోవడం జరిగింది. 1984 జూన్ నెలలో పది రోజుల పాటు జరిగిన ఈ మిలటరీ చర్య వలన బింద్రన్ వాలే తో సహా అనేక మంది ఉగ్రవాదులు నేలకొరిగారు. ఇందిరా గాంధీ తీసుకున్న ఈచర్య ఆమె ప్రాణాలనే హరించింది. శతృదుర్భే ద్యమైన భద్రతా వ్యవస్థ తన చుట్టూ ఉన్నా, తను అత్యంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నాననే సంకేతం ఇందిరా గాంధీ మాటల్లో ప్రతిధ్వనించింది. తన మరణాన్ని ఆమె ముందే ఊహించింది. 1984 అక్టోబర్ 30 వ తేదీన ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, తాను చనిపోయినా తాను చిందించే ప్రతి రక్తపు బొట్టు దేశాన్ని మరింత బలపరుస్తుందని ఉద్ఘాటించారు.ఆమె అనుమానం నిజమైనది. కనురెప్పలే కంటిని కాటేసినట్టుగా తన రక్షణ చూడవలసిన అంగరక్షకులే భక్షకులుగా మారి,విశ్వాస ఘాతకులైనారు. మరుసటి రోజు అనగా 1984 అక్టోబర్ 31 వ తేదీన న్యూఢల్లీిలో తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు ఇందిరాగాంధీ నేలకొరిగారు. అశేష జనవాహిని కన్నీటి సంద్రమై విలపించింది.
image.png
సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు)
9704903463.





