- అబిఆర్‌ఎస్‌లో అసమ్మతి తట్టుకోలేక అమెరికా వెళ్లిన కెటిఆర్
- అ కేసీఆర్ రాజకీయ వ్యభిచారి… ఇచ్చిన హామీలను నెరవేర్చని వంచకుడు
- అరానున్న ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తాం అతీవ్ర స్థాయిలో విమర్శించిన బండి సంజయ్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: భారత సైంటిస్టులు చంద్రయాన్‌ను విజయవంతం చేయడంతో అక్కడి భూములను సైతం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తీవ్రంగా యోచిస్తున్నాడని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని భూములన్ని తన అనుయాయులకు, కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన సిఎం కేసీఆర్ ప్రస్తుతం చంద్రమండలం గూర్చి ఆలోచిస్తున్నాడని, అక్కడి స్థలాలను బడుగు,బలహీన వర్గాలకు కేటాయిస్తానని హామీలు ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, దానిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు,దాడులు కొనసాగిస్తున్నారని, బెంగాల్ తరహా పాలనను తెలంగాణలో కేసీఆర్ కొనసాగిస్తున్నాడని ఆరోపించారు.
బిఆర్‌ఎస్ అవినీతి అక్రమాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న బిజెపి శ్రేణులపై దాడులను చేయిస్తున్నారని,ఈ దాడులకు తమ పార్టీ నేతలు,కార్యకర్తలు ఎంతమాత్రం వెనుకంజవేయబోరని అన్నారు.రానున్న శాసస సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపును సిఎం కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారని, దీనితో తీవ్ర వ్యతిరేకత ఉంటుందని,బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గ్రహించి అమెరికా వెళ్లాడని ఆరోపించారు. సిఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో కనీసం సగం మందికి బి ఫారం లభించదని,ఇప్పటికే లాబీయింగ్ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. రానున్న ఎన్నికల సందర్భంగా బరిలో నిలిచే సిఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఏమేరకు అమలు పరిచారో ప్రకటించాల్సిందిగా సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీ పైనే దృష్టి సారించిందని, మద్యం దుకాణాల యజమానులను బుజ్జగించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారని ఆయన అన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలన్ని ప్రజామోదం పొందుతున్నాయని, రానున్న శాసన సభ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టి అధికారంలోకి రాబోతుందని అన్నారు. బిఆర్‌ఎస్,బిజెపిల మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ పార్టి నాయకులు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టి ఏనాడు కూడ బిఆర్‌ఎస్ పాలనపై ప్రజా ఉద్యమాలు చేపట్టలేదేని, అయితే తమ బిజెపి కార్యకర్తలు ప్రతినిత్యం కేసీఆర్ విధానాల పట్ల ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సిఎం కేసీఆర్ ప్రకటించి,బిల్లును ఆమోదింప చేశారని, అయితే గవర్నర్ ఇంకా అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో ఆమెను ప్రసన్నం చేయడానికి సిఎం కేసీఆర్ శతవిధాల యత్నిస్తూ, రాష్ట్ర సచివాలయానికి ఆహ్వానించారని అన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యభిచారి అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, దానికి అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజక వర్గానికి ఇంచార్జిలుగా నియమించిందని, తాము ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బిజెపి ఎమ్మెల్యేలు ఏడుగురు పాల్గొన్నారు.




