‌గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష రద్దుపై …టిఎస్‌పిఎస్‌సి లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌

  • ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం
  • నేడు విచారిస్తామన్న హైకోర్టు

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 25(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దుపై హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్‌ ‌బెంచ్‌ ‌జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ ‌మోషన్‌  అనుమతి కోరుతు పిటిషన్‌ ‌దాఖలు చేసింది. అయితే దీనిపై మంగళవారం విచారిస్తామని హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌తెలిపింది. దీంతో గ్రూప్‌ ‌రద్దుపై హైకోర్టు మంగళవారం విచారించనుంది. కాగా, ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అందులో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. నిరుడు అక్టోబర్‌ 16‌న తొలిసారి గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలో బయోమెట్రిక్‌ ‌విధానాన్ని అమలు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఈ ఏడాది జూన్‌ 11‌న నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్‌ను ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై డివిజన్‌ ‌బెంచ్‌కు స్పష్టత ఇవ్వనున్నది.

ప్రిలిమ్స్‌కు హాజరైన 2,33,506 మంది అభ్యర్థుల్లో కేవలం ముగ్గురి కోసం పరీక్షను మళ్లీ వాయిదా వేస్తే మిగిలిన 2,33,503 మంది ఇబ్బంది పడతారని, వారిపై ఆర్థిక భారం పడటంతోపాటు ఎంతో విలువైన సమయం వృథా అవుతుందనే విషయాన్ని ప్రధానంగా ప్రసావించబోతున్నది. గ్రూప్‌-1 ఉద్యోగానికి ప్రిలిమినరీ పరీక్షే ప్రధానం కాదని, మెయిన్స్ ‌పరీక్ష కూడా ఉన్నదనే విషయాన్ని బలంగా వినిపించాలని కమిషన్‌ ‌భావిస్తున్నట్టు తెలిసింది. ఉద్యోగ నియామక పరీక్షకు తొలిసారి టీఎస్‌పీఎస్సీయే ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్‌ ‌విధానాన్ని ప్రవేశపెట్టింది. సివిల్‌ ‌సర్వీస్‌ ‌నియామకాల కోసం యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌(‌యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లోనూ ఈ విధానం లేదు.

నిరుడు అక్టోబర్‌ 16‌న గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌సమయంలో బయోమెట్రిక్‌ ‌హాజరు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అభ్యర్థుల్లో చాలా మంది ఒకేసారి పరీక్షా కేంద్రాలకు రావడం, సమయం సరిపోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణం. వీటిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ రెండోసారి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినప్పుడు అభ్యర్థుల సౌలభ్యం కోసమే బయోమెట్రిక్‌ ‌విధానాన్ని తొలగించింది. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ ముందుగానే తెలియజేయడంతోపాటు ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీగా మూడంచెల తనిఖీలు చేపట్టింది. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక సమాచారం మేరకే అభ్యర్థుల సంఖ్యను తెలిపిన టీఎస్‌పీఎస్సీ.. ఓఎంఆర్‌ ‌పత్రాల స్కానింగ్‌ ‌తర్వాత మొత్తం అభ్యర్థుల సంఖ్యను ప్రకటించింది. ఈ అంశాలను కూలంకషంగా హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌కు వివరించాలని కమిషన్‌ ‌భావిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *