కందుకూరు,జూలై 31 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామపంచాయతి సిబ్బందికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ మహేశ్వరం నియోజకవర్గ మహిళా కన్వీనర్ ఇందుమతి మాట్లాడుతూ,గ్రామ పంచాయతి సిబ్బంది గత 25 రోజులుగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చేస్తున్న ఈ సమ్మె న్యాయ సమ్మతమైనదని అన్నారు.25 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.పంచాయతి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులను,ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యాలు,ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని,కార్మిక హక్కులలో భాగంగా నెలకు ప్రతి కార్మికునికి 19500 వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.గ్రామంలో ఎలాంటి అంటువ్యాధులు రాకుండా గ్రామాల్ని ఎప్పటికప్పుడు కాపాడుతున్న సిబ్బందికి ఈరకమైన నిర్లక్ష్య ధోరణి సరైనది కాదని విమర్శించారు. ఒకవైపు ముఖ్యమంత్రి నెలకు నాలుగు లక్షల 50 వేల రూపాయలు జీతం తీసుకొని ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడని అన్నారు. వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు.స్థానిక శాసన సభ్యురాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీరి విషయంలో పట్టించుకోకుండా ఉండడం సరైనది కాదని అన్నారు.గ్రామపంచాయతి సిబ్బందిలో 90 శాతం మంది మహిళలే పని చేస్తున్నారని అన్నారు.మహిళా మంత్రి అయి ఉండి మహిళల సమస్యలను పరిష్కరించకపోతే ఆమె పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఆమె ఘాటుగా విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం కనులు తెరిచి గ్రామపంచాయతి సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నడ్డి నరసింహ,మధుకర్,కందుకూరు మండల సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఆర్డిఓకి సమస్యలను వివరిస్తూ మెమోరాండం అందజేశారు




