- కరీంనగర్, హైదరాబాద్‌లో 30 చోట్ల తనిఖీలు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రి గంగుల కమలాకర్ సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళపై ఈడి దాడులు
- తాళం వేసి ఉన్నా పగులగొట్టి మంత్రి ఇంట్లో సోదాలు
హైదరాబాద్/కరీంనగర్, ప్రజాతంత్ర: బుధవారం కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి జాయింట్ ఆపరేషన్ చేసింది. కరీంనగర్, హైదరాబాదులో సోదాలు కొనసాగాయి. దాదాపుగా 30 ప్రాంతాల్లో ఐటి, ఈడి సోదాలు నిర్వహించడం కలకలం రేపుతుంది. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోనే సిబిఐ కేసు నమోదు చేశారు. సిబిఐతో పాటు ఇడిలో గ్రానైట్ అక్రమాలపై కేసు నమోదు చేశారు. కమాన్ ప్రాంతంలో అరవింద్ గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాస్ ఇంట్లో సోదాలు చేపట్టారు. రాజేంద్రనగర్ హైదర్ గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఇడి సోదాలు చేపట్టింది. నాలుగవ అంతస్తులో ఉన్న గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ కార్యాలయంలో అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. శ్వేతా ఏజెన్సీ, ఎఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజెన్సీస్, పిఎస్‌ఆర్ ఏజెన్సీస్, కెవిఎ ఎనర్జీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ సంస్థలు మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాయి. అయితే ఫెమా నిబంధనలకు విరుద్ధంగా పరిధికి మించి ఈ సంస్థలు తవ్వకాలు జరిపాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈడీ మెరుపు దాడులు చేసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రి గంగుల కమలాకర్ సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళపై ఈడి దాడులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రానైట్ పరిశ్రమల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై ఈడి అధికారులు కొరడ జులిపిస్తున్నారు. క్వారీ గ్రానైట్ అనుమతులపై వొచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఈడి అధికారులు ఏకకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాడులు నిర్వహించి సోదాలు జరుపుతున్నారు. 15 మంది ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా తనఖీలు చేపట్టింది. గ్రానైట్ తవ్వకాల్లో జరిగిన అవకతవకలపై అధికారులు సోదాలను ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వేత గ్రానైట్ అధినేత, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై అధికారులు పకడ్బందీగా సోదాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి గంగుల గమలాకర్ ఇంటికి తాళం వేసి ఉన్నా కూడా తాళాలు పగుల కొట్టి కూడా అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మంత్రి గంగుల కమలాకర్ విదేశాల టూర్‌లో ఉన్నట్లు సమాచారం. గ్రానైట్ పరిశ్రమలున్న ఒద్యారం, బాహుపేట, హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ చోట్ల కొనసాగుతున్నా గ్రానైట్ క్వారీ పరిశ్రమలపై సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు అర్ధరాత్రి కూడా జరిగే అవకాశాలున్నాయి.




