గౌడ జనాభా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అధిక శాతం ఓటు బ్యాంకు కలిగిఉన్న గౌడ సామాజిక వర్గానికి జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించి న్యాయం చేయాలని గౌడ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ‘గోపా’ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్ అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీలు కేవలం మూడు, నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడం దారుణం అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో 50 నుండి 75 వేల మధ్య ఉన్నారని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో దాదాపు 25 నుండి 40 వేల వరకు గౌడ సామాజిక ఓటర్లు ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ప్రధాన పార్టీలు కల్పించకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి డా. బండి సాయన్న మాట్లాడుతూ గౌడలు గెలిచే స్థానాల్లో కూడా గౌడలకు కాకుండా వేరే వర్గాల వారికి సీట్లు చేటాయించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కేవలం అగ్రకులాల వారికే సీట్లు కేటాయించి, గౌడలకు మొండిచేయి చూపించారని అన్నారు. పార్టీలకు అతీతంగా గౌడ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గౌడల గెలుపుకు ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నామని, అన్ని గౌడ కులసంఘాలకు కలుపుకు పోతామన్నారు. గౌడ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ‘గోపా’ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ విషయమై ‘గోపా’ అన్ని జిల్లా, మండల స్థాయి యూనిట్ల కార్యవర్గాలన్నింటికీ సూచనలు చేసిందన్నారు. ఈ సమావేశంలో కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్, ముంజ వెంకట్ రాజన్, వీరయ్య గౌడ్, ప్రసాద్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *