గోవును కౌగలించుకోకపోయినా కాపాడుకుంటే చాలు

మానవుని జీవన విధానానికి పర్యావరణానికి విడదీయరాని సంబంధం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్న విషయాన్ని గ్రహించి  సుందర్‌లాల్‌ ‌బహుగుణ నాయకత్వంలో •నేటికి సరిగ్గా యాభై ఏండ్ల కింద  నాటి ఉత్తరప్రదేశ్‌ ‌నేటి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 1973లో ‘చిప్కో’  ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ప్రజలను చైతన్యవంతులను చేసింది. కేవలం అడవులేకాకుండా, పర్యావరణానికి భంగం కలిగించే ఏ చర్యఅయినా మానవుని మనుగడకు ఎలాంటి ప్రమాదకారి అవుతుందన్న విషయాన్ని ఇప్పుడు దేశ ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. ఆనాడు చెట్లు నరికివేతను ఆపడానికి స్థానిక మహిళలు, పిల్లలు చెట్లను కౌగలించుకుని(చిప్కో అంటే ఆలింగన చేసుకోవడం), ముందు తమ తలలు నరకిన  తర్వాతే చెట్లను నరకండి అంటూ ఎంతో సాహాసవంతంగా చేసిన ఉద్యమం దేశ చరిత్రలోనే మరుపురాని ఘటనగా నిలిచింది.

నేడు అంటే ఫిబ్రవరి 14న దేశమేకాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వాలంటైన్‌ ‌డే లో భాగంగా కౌ హగ్‌• ‌డే (ఆవులను కౌగలించుకోవడం) జరుపుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  జంతు ప్రేమికులు, ముఖ్యంగా గోప్రేమికులు ఈ పిలుపును స్వాగతించినప్పటికీ కొందరు వివిధ  రీతుల్లో తమ వ్యతిరేకతను చాటడంతో యానిమల్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు ఆఫ్‌ ఇం‌డియా సూచనలతో కేంద్ర మత్స్య, పశు సంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ తానిచ్చిన అదేశాలను వెనక్కు తీసుకోవాల్సివొచ్చింది. ఆవులను ఆలింగనం చేసుకోవడంద్వారా దేహంలోకి పాజిటివ్‌ ఎనర్జీ ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నది జంతు పరిరక్షణ బోర్డు ఉద్దేశ్యం. అయితే ఉద్ధేశ్యం సరిఅయినదే అయినా ప్రజలు గోవుల వెంటపడి దాన్ని కౌగలించుకునే ప్రయత్నంలో అవి కొమ్ములతో కుమ్ముతే జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారని పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటివారు వేస్తున్న ప్రశ్న.

ఈ సందర్భంలో ఎవరైనా గాయపడితే వారికి నష్టపరిహారంగా కనీసం పదిలక్షలవరకైనా ఇవ్వాలన్నది ఆమె సూచన. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, ఎంపీ కూడా అయిన శశిథరూర్‌కూడా సోషల్‌ ‌మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రేమికుల రోజున తన పార్ట్‌నర్‌ను ప్రేమగా కౌగించుకుంటారు. ఇంగ్లీషులో  ‘గే’ అనడానికి బదులు కేంద్రం ‘గాయ్‌’ (ఆవు) అనిఉంటుందని చలోక్తి విసిరారు.ఏదియేమైనా భారతీయులకు, గోవులకు విడదీయరాని అనుబంధం ఉంది.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న విషయం తెలియందికాదు. గోవు భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవతగా కొలువబడుతున్నది. అనేక ఇతిహాసాలు, పురాణ గాథలు గోవుల విశిష్ఠతను చెబుతున్నాయి. భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాలలో అసమాన గోమహిమ గురించి వర్ణించబడింది. గోరక్షణ, దేశ రక్షణకన్నా ఎంతో పవిత్రమైనదిగా మహత్మాగాంధీ పేర్కొన్నారు.

అంతేకాదు గో సంపద మనదేశ సంస్కృతి, సంప్రదాయాలకు, గ్రామీణ ఆర్థిక ప్రగతికి పూర్వంనుండి ఎంతో దోహదపడుతున్నది. తల్లిపాల తర్వాత గోవుపాలను అంత శ్రేష్ఠమైనవిగా పూర్వకాలంనుండీ చెబుతూ వొస్తున్నదే. దేవతారార్జన క్రమంలో గోమయంతో శుభ్రంచేయడం, గోవు పాలతో అభిషేకాలు చేయడమన్నది అనాదిగా వొస్తున్న ఆచారం. కేవలం పాలు మాత్రమే కాకుండా పేడ, మూత్రంలో  కూడా ఔషధ గుణాలున్నట్లు ఇటీవల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యజ్ఞ యాగాదుల్లో ప్రత్యేకంగా ఆవు నెయ్యి వాడడానికి కూడా కారణాలున్నాయి. ఆవు నెయ్యి, ముఖ్యంగా కామధేనువు నెయ్యి అగ్నిలో ఆహుతి అయితే అది ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుందని సైన్స్ ‌చెబుతోంది. అంతేకాదు గాలిలోని సూక్ష్మజీవులను నశింపజేస్తుందట. ఇంతటి విశిష్ఠతగల గో సంపద ఎంత ఉంటే అంత ధనవంతులుగా చెబుతారు.  ఆవు సకల దేవతానిలయమని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో అవయంలో ఒక్కో దేవత నివాసస్థానముంటుందంటారు. అందుకే గోప్రదక్షణ సకలదేవతల ప్రదక్షణగా భావిస్తారు.

దైవంతో సమానమైన గోవును పరిరక్షించుకోవడానికి ఇప్పుడు సమాజం ముందుకు వొస్తున్నది. దీనికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాలని 2010లోనే దాదాపు ఎనిమిది కోట్ల మంది సంతకాలతో ఆనాటి రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడమైంది. భారత రాజ్యాంగంలో గోవధను నిషేధించడంతోపాటు, వాటిని కాపాడాలని నిబంధనలను పొందుపర్చారు. అందుకు జంతుహింస నిరోధక చట్టాన్ని కూడా 2016లో తేవడమైంది. అంతేకాదు గోవులను అక్రమంగా రవణా చేయకుండా 1978లో పలు నిబంధనలతో చట్టాన్ని తీసుకువొచ్చారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం గోవుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు, వాటి సంరక్షణకోసం ప్రత్యేకంగా గో సౌరక్షణ సెస్‌నుకూడా విధించాలని నిర్ణయించింది.  మానవ మనుగడకు, ఆర్థిక, శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పడుతున్న గో సంపద నేడు తరిగిపోతున్న తరుణంలో వాటిని పరిరక్షించేందుకు అనేక స్వచ్ఛంద  సంస్థలు, దేవాలయాలు, జంతు ప్రేమికులు ముందుకు రావడం ముదావహం. వాటిని ఆలింగనం చేసుకుంటే శరీరంలో పాజిటివ్‌ ఎనర్జీ వొస్తుందని చెబుతున్న క్రమంలో అంత సాహాసం చేయకపోయినా వాటి పరిరక్షణకు తోడ్పడితే చాలంటున్నారు జంతు ప్రేమికులు.
image.png
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *