గోబెల్స్‌ ప్రచారంతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

  • మా కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తుంది
  • మేమూ ఇదే విధంగా ఉంటే వాళ్లు సగం మంది జైల్లో ఉండేవారు
  • పార్లమెంటులో ఎంపిలకే భద్రత కరువు
  • నర్సాపూర్‌ సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు

మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ వాళ్లు గ్లోబెల్స్‌ ప్రచారం చేసి అధికారంలోకి వొచ్చారని, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నర్సీపూర్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అబద్ధపు కేసులు బనాయించాలని చూస్తుందని మండిపడ్డారు. మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదన్నారు. నిజంగా కెసిఆర్‌ అనుకుంటే సగం మంది కాంగ్రెస్‌ నాయకులు జైల్లో ఉండేవారని హెచ్చరించారు. హౌసింగ్‌ స్కాములపై సిఐడి విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్‌ వొచ్చిందని హరీష్‌ రావు పేర్కొన్నారు. ఇదిలా వుంటే పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై హరీష్‌ రావు ఘాటుగా స్పందించారు.

ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన ఘటన బాధాకరం అని అన్నారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అత్యంత భద్రతతో కూడిన పార్లమెంటులో ఎంపీలకే భద్రత కరువైందని అన్నారు. కొత్త పార్లమెంటు కట్టి ఏం లాభమని హరీష్‌ రావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు ఘనంగా ఉంటాయని, చేతల్లో మాత్రం ఆ ఘనం లేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడి గుర్తుకు వొస్తుందన్నారు. పార్లమెంట్‌ సభ్యులందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు హరీష్‌ రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.  ‘బిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన కృషి నిలకడ విూద తెలుస్తుంది. మేము పగ విూద దృష్టి పెట్టలేదు.

మన ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్టులు చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్‌ నాయకులు సగం మంది జైళ్లలో ఉండేవారు. కానీ మనం అలా చేయలేదు. గెలుపు ఓటములు సహజం ఒలికిపోయిన పాల గురించి ఆలోచన వద్దు. భవిష్యత్తులో సాధించే విజయం గురించి ఆలోచిద్దాం. అందరం కలిసి శ్రమించి విజయం వైపు వెళ్దాం. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒడిదొడుకులు సహజం. 2001 నుండి ఎన్నో ఆటు పొట్లు ఎదుర్కున్నాము. ఎదిగినా ఒదిగి పని చేశాం. పాలు, నీళ్ళు ఏంటి అనేది నాలుగు రోజుల్లో ప్రజలు గుర్తిస్తారు. అధికార పక్షం అయినా, ప్రతి పక్షం అయినా మేం ప్రజల పక్షం. ఇచ్చిన హావిూలు అమలు చేసేలా పోరాటం చేస్తాం. నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ ఆందోళన వద్దు. నర్సాపూర్‌లో అన్ని మండలాలు మంచి లీడ్‌ ఇచ్చాయి. అందరూ బాగా కష్ట పడ్డారు‘ అని హరీష్‌ రావు భరోసా కల్పించారు.

నర్సాపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కృతజ్ఞత సభలో హరీష్‌ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరూ కష్టపడ్డారు. నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టేలా చేశారు. శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నాను. కష్టపడిన వారిని కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాం. పార్టీ ఓటమి అనేది ఒక స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే. గమ్యం చేరేది మన బీఆర్‌ఎస్‌ పార్టీ నే. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం అధికార పక్షం చేస్తుంది. ఫోన్‌ చేస్తే గట్టిగా గంటలో అందుబాటులో ఉంటాను. విూ ఎమ్మెల్యే సునితమ్మతో పాటు నేను అందుబాటులో ఉంటా.’ అని హరీష్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *