ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో సీఈవో మహేష్ గోడి భేటీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 17 : గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్లో 12.5 శాతం జిడబ్ల్యుహెచ్ (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అదే వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో గోడి ఇండియా అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. రాబోయే అయిదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి(ఆర్&డి), గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. గోడి ఇండియా పెట్టుబడులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు.
తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌లను ప్రోత్సహించటంతో పాటు పర్యావరణ అనుకూల వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందుకు అవసరమైన విధానాలకు తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పర్యావరణ వ్యవస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు అనుసంధానమై ఉందని, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ల రూపకల్పనలో గోడి కీలకంగా నిలుస్తుందని అన్నారు. తమ కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి మహేష్ గోడి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత తెలంగాణలో వ్యాపారాలకు సానుకూల వాతావరణంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ రూ 9,000 కోట్ల పెట్టుబడులు
జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జెఎస్డబ్ల్యు నియో ఎనర్జీ, తెలంగాణ లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం జెఎస్డబ్ల్యు నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జెఎస్డబ్ల్యు ఎనర్జీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్నది. ఈ సంస్థ థర్మల్, హైడ్రో మరియు సౌర వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా, ఇది 4,559 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. జెఎస్డబ్ల్యు నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుందని అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా %జీ•ఔ% ఎనర్జీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, భవిష్యత్ ప్రాజెక్టులపై సహకరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం అందించిన సహకారానికి సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో జెఎస్డబ్ల్యు వేగంగా విస్తరిస్తున్నదని, తెలంగాణలోనూ తమ గ్రూప్ ను విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్ వెబ్ వెర్కస్ రూ. 5,200 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్కస్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్కస్. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్కస్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్కస్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్ వర్కింగ్-హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాలలో గ్రీన్ ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది.తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. డేటా సెంటర్ల ద్వారా ఐటీ రంగం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందని అన్నారు. పెట్టుబడిదారులు అందుకు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెపుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం, దేశంలో తమ డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరించడంపై ఐరన్ మౌంటైన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన ప్రాధాన్యతలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మా డేటా సెంటర్లలో 100% పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నాము. దీనిని భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నాం. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం డేటా సెంటర్లు మరియు పునరుత్పాదక ఇంధనం రెండింటికి మద్దతు అందించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చింది.. ’’అని విలియం మీనీ అన్నారు.





