పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: దేశంలోనే మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక స్వావలంభన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..20 మేకలు ఒక పోటేలుతో కూడిన యూనిట్ ధర ఒక లక్ష 75 వేల రూపాయలు కాగా సభ్యుడు 43,750 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం ఒక లక్ష 31 వేల 350 రూపాయలు సబ్సిడీ చెల్లిస్తోందని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిక్షపతి, రాజు, తదితరులు పాల్గొన్నారు.



