ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం పేరిట ఇంటి జాగా ఉన్నవారికి గృహం నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించడంతో అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కోసం కావాల్సిన పత్రాల కొసం మీసేవ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆమనగల్లు పట్టణంలోని పలు మీసేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు విధించింది. ఇదిలా ఉండగా మండల స్థాయి అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో వారు గృహలక్ష్మి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు వెనుకాడుతున్నారు. దీంతో లబ్ధిదారులు మండల కార్యాలయాల ముందు ఆందోళన చెందుతున్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో జాప్యంతో పాటు దరఖాస్తులు ఎలా చేయాలన్న దానిపై స్పష్టత కరువయ్యింది. మహిళల పేరిటనే పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొంతమంది గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ పరుగులు తీస్తూ.. ఇంటి పన్నులు కడుతున్నారు. భర్త పేరు నుండి భార్య పేరు పై మార్చుకునేందుకు పోటీ పడుతున్నారు. సుధూర ప్రాంతాల నుండి మండల కేంద్రాలకు వచ్చి మండల కార్యాలయాల ముందు లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు మాత్రం దరఖాస్తులు స్వీకరించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చేపడుతున్నారు. అధికారులు మాత్రం తమకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని అందుకే లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెబుతున్నారు.




