గుణాత్మ‌క విలువ‌ల వైపు ఆలోచ‌న‌…

సంక్షోభ శిఖ‌రం మీద గాయాల చ‌రిత్ర‌గా వ‌ర్త‌మాన జీవితం మారింది. ప్ర‌మాద సూచిక‌ల‌ను మోస్తున్న గుండెలే ఎక్కువ‌.
త‌ల్ల‌డిల్లి ఎగ‌బాకే ఆలోచ‌న‌ల‌తో నిత్య‌యుద్ధం ఎవ‌రికీ త‌ప్ప‌డం లేదు. వేద‌న క‌న్నీటి బొట్టైప‌‌డిన చోట స‌ముదాయించి
న‌డిపించే దృశ్యాలు అంత‌ర్థాన‌మైపోతే క‌విత్వం ప‌రామ‌ర్శ‌గా మారింది. వేద‌న‌ల‌, సంవేద‌న‌ల స‌మ‌న్వ‌యంగా మాన‌వీయ
విలువ‌ల అనుభ‌వాత్మ‌క‌త‌తో డా. సిహెచ్ ఆంజ‌నేయులు ఆశ‌ల గాలిప‌టాల‌ను ప‌రిచారు. గాఢ‌త‌, సాంద్ర‌త‌ల
స‌మ్మేళ‌నంగా 65 క‌విత‌ల‌తో సాగిన ఈ సంక‌ల‌నాన్ని ఆంజ‌నేయులు ప్ర‌ఖ్యాత క‌వులు కె శివారెడ్డి, అమ్మంగి
వేణుగోపాల్‌ల‌కు అంకిత‌మిచ్చారు.
అన్యాయంపై ప్ర‌తిఘ‌ట‌న‌, మాన‌వీయ సామాజిక స్పృహను ఆసాంతం ఆంజ‌నేయులు త‌మ క‌విత‌ల్లో వ్య‌క్తప‌రిచారు.
రాలిన ఆకుల‌ను చూసి/ చెట్టువైపు జాలిగా చూడ‌కు/ చిగురు టాకుల‌ను చూసి వ‌సంతోత్స‌వ‌మ‌ని/ అతి ఉత్సాహం
చెంద‌కు అని జీవిత‌పార్శాల‌ను ఎత్తి చూపారు. ఈ వ‌రి పొలాల ప‌చ్చ‌ద‌నంతో/ న‌ది స్నేహం/ వూళ్లే స్నేహ వార‌ధులు/ నా
క‌ల‌ల రాశుల‌/ఆశా‌ కెర‌టాలు వీళ్లే అని త‌న అనుబంధాల్ని గుర్తు చేసుకున్నారు. వ‌ల‌స‌ల‌పై స్పందిస్తూ రెక్క‌లొచ్చిన
ప‌క్షుల లెక్క‌/ ఎగిరిపోయినారు/ దూర తీరాల‌కు… భారంగా క‌న్నీళ్లు నిండిన / బ‌రువైన గుండెతో అని వేద‌న ప‌డ్డారు. మా
ఇళ్లు గంభీర నిశ్శ‌బ్ధం ఆవ‌హించిన/ నిశ్చ‌ల స‌మాధిలా ఉంది అని అంద‌రూ వెళ్లిపోతే ఖాళీ అయిన ఇంటిలో మిగిలిన
వృద్ధుల ప‌రిస్థితిని వివ‌రిస్తారు. అమ్మ ఒడి, జోల‌పాట లాంటి ప‌చ్చ‌నాకే త‌న‌కిష్ట‌మ‌ని చెబుతూ ప‌ర్యావ‌ర‌ణ ప్రాధాన్య‌త‌ను
చాటారు.
రైతుల వెత‌ల‌‌ను, ఆర్థిక ప‌రిణామాల‌ను, మార్కెట్ మాయాజాలాల‌ను, సంక్షేమం పేరిట జ‌రుగుతున్న‌
సంక్షోభాల‌ను భావోద్వేగ సంవేద‌‌నగా వ్య‌క్త ప‌రిచారు. దుర్మార్గాల‌ను, విధ్వంసాల‌ను, అమాన‌వీయ‌త‌ను వ‌స్తువులుగా
చేసుకొని ఆంజ‌నేయులు క‌విత‌లును మ‌లిచారు. ఈ మ‌ట్టి నాద‌ని ద‌బాయించ‌కు / ఈ నీళ్లు నావేన‌ని దౌర్జ‌న్యం
చేయ‌బో‌కు/ ఈ విశ్వంలో స‌మ‌స్థం, ఈ పంచ‌భూతాలు ఎవ‌డ‌బ్బ‌ సొత్తు ? అని సూటిగా ప్ర‌శ్నిస్తారు. మార్కెటింగ్ వ్య‌వస్థ
జీవితంలో చూపుతున్న ప్ర‌భావాన్ని చెబుతూ డబ్బుంటే ఆకాశం తోట‌లోస్/ న‌క్ష‌త్ర పుష్పాల‌నే కొనితెచ్చి/ సిగ‌లో
తురుముకోవ‌చ్చు అంటారు. జ‌న‌న మ‌ర‌ణాల మ‌ధ్య బ్ర‌తుకొక ప్రాణాయామం అంటూ తాత్విక‌త‌ను వినిపించారు.
సౌమ్య‌త‌తో పాటు హెచ్చ‌రిక‌ల‌తో క‌విత్వీక‌ర‌ణ సాగింది. ఆశ‌తో కూడిన విశ్వాసం వ్యక్త‌మైంది. ప్రకృతితో మ‌మేకమైన
మనిషి జీవితం ప‌రిఢ‌విల్లింది. అక్ష‌రాలు న‌గ్న స‌త్యాన్ని వెద‌జ‌ల్లే అగ్ని సంత‌కాలు అన‌డంలో క‌విలోని ఆవేద‌నాగ్ని
దృశ్యామా‌న‌మౌతుంది. అన్వేష‌ణా దారుల్లో సాగిపోవాల‌న్న‌ది క‌వి కోరిక. క‌విత్వాన్ని క‌న్నుగా మ‌లుచుకొని కొత్త
అభివ్య‌క్తితో న‌డ‌వాల‌న్న‌ది ఆకాంక్ష.
స్ప‌ష్ట‌మైన దృష్టి, దృక్పథంతో జీవిత‌పు లోతుల్ని, వ‌ర్త‌మాన శిథిల స్థితిని అర్థం చేసుకున్న తీరు క‌విత‌ల్లో
క‌నిపించింది. బ్ర‌తుకు దృశ్యంలో స‌జీవ‌త లేనేలేదు అంటారు. ఎంత వెతికినా బ్ర‌తుకులో ప్ర‌శ్న‌లే మిగిలిపోతుంటాయి
అన‌డంలో క‌వి ప‌రిశీల‌నాదృష్టి తెలుస్తుంది. బ‌తికి ప‌రిమ‌ళించు/ బ‌తుకు అంద‌రికి పంచు అని యువ‌త‌ను ఉద్దేశించి
అంటారు. ఏదీ కాదు/ ఏదీ రాదు అంటూ మ‌నిషిని ఆద‌ర్శంగా జీవించ‌మంటారు. భావ వ్య‌క్తీక‌ర‌ణ మాధ్య‌‌మంగా

క‌విత్వాన్ని క‌వి విశ్వ‌సించిన తీరును చాలా క‌విత‌ల్లో గ‌మ‌నించ‌వ‌చ్చు. గాలిప‌టం వంటి జీవితానికి వేద‌న‌ను తుడిచి
భరోసాను అద్దారు. అనుబంధాల‌ను గుర్తు చేస్తూనే స్వేచ్చాత‌ప‌న‌ను అన్వేషించారు. స‌హ‌జ‌మైన భావ ప్ర‌క‌ట‌న‌గా,
శ‌క్తివంత‌మైన వ్య‌క్తీక‌ర‌ణ‌గా క‌విత్వాన్ని మ‌ల‌చ‌డ‌మే కాకుండా స్థానిక ప‌రిమ‌ళం కూడా జ‌త చేయ‌డం చెప్పుకోద‌గ్గ‌ది.
ఆనందం, ఆవేద‌న‌, ఆస్తిత్వ ప‌రివేద‌న‌ను క‌విత‌లు వ్య‌క్త ప‌రిచాయి. గ‌తానికి, వ‌ర్త‌మానానికి ఉన్న తేడాను స్ప‌ష్టంగా
గుర్తించారు క‌వి. ప్ర‌‌తీ మ‌లుపులో ఆశ‌ల ఉష‌‌స్సును వెత‌కాల‌ని చెబుతారు. కొన్ని మ‌లుపులు అంతిమ తీర్పుల అద్భుత‌‌
స‌జీవ సంత‌కాలు అన‌డంలో తాత్విక బోధ‌న వ్య‌క్తమైంది. సామాజిక స‌మ‌స్య‌ల వెనుక ఉన్న ఎన్నో కోణాలను ద‌ర్ప‌ణంగా
ఇందులోని ప‌లు క‌విత‌లు ఉన్నాయి. చైత‌న్యాన్ని అందిస్తూ, వాస్త‌వాల బాట‌ల్ని నిర్దేశిస్తూ గుణాత్మ‌క విలువ‌ల వైపు
ఆంజ‌నేయులు ఆలోచింప‌జేశారు.

– డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *