- హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, మంత్రులు
- హిమాచల్‌లో సిఎంగా సుఖ్వీందర సింగ్
గాంధీనగర్, డిసెంబర్ 12 : గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్టాల్ర సీఎంలు, స్మ•తి ఇరాని, పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 1, 5 తేదీల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. 182 స్థానాల్లో పోటీ చేసి 156 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 17, ఆప్ 5 స్థానాలు గెలుచుకుంది. దీంతో భూపేంద్ర పటేల్ ఇవాళ రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుంటే నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే , ఓ బస్ డ్రైవర్ కుమారుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు (58) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ముఖేష్ అగ్నిహోత్రి (60) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..
సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గంలో 12 మంది ఉండవచ్చునని భావిస్తున్నా, వీరిద్దరూ మినహా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి, నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు భూపేష్ బాఘేల్, అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, హిమాచల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, సచిన్ పైలట్, సుఖు కుటుంబసభ్యులు, ఆయన తల్లి, భార్య, కుమార్తెలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎని?కల్లో 68 సీట్లును అసెంబ్లీలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్)సహా పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన పది హాలను అమలు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్ సుఖు హా ఇచ్చారు.
ప్రమాణ స్వీకారం అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజలనుద్ధేశించి ఆయన ప్రసంగించారు. పారదర్శకమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యవస్థను, కొత్త ఆలోచనలను అమలులోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తామని చెప్పారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు సాధారణ కుటుంబం నుంచి ఎదిగారు. సుఖ్వీందర్ సింగ్ తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పని చేశారు. సుఖు ఒకప్పుడు పాలు విక్రయించారు. సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీలో చదువుతూ సామాజిక కార్యకర్తగా ఎదిగారు. 1980ల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక 2000లో స్టేట్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడయ్యారు.
2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 2019లో ప్రతిభాసింగ్ బాధ్యతలు చేపట్టే వరకు పిసిసి చీఫ్‌గా పనిచేశారు. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 58 ఏళ్ల సుఖుకు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. బిజెపికి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సతీమణి, పిసిసి చీఫ్ ప్రతిభా సింగ్‌ను పక్కనపెట్టి సుఖును కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం గమనార్హం. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు ప్రతిభాసింగ్ తెలిపారు.


