గీతం లో పీఎక్స్ ఆర్ డీ ల్యాబ్ ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో పౌడర్ ఎక్స్-రే డిఫ్రాక్షన్ (పీఎక్స్ ఆర్ డీ) ప్రయోగశాలను బుధవారం కెమిన్టక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జేఏఆర్పీ శర్మ ప్రారంభించారు. క్రిస్టల్లోగ్రఫీ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రారంభోత్సవంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ కొల్లు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీఎస్ఆర్డీ వినియోగాలు అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు జాతీయ కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శర్మ ఆ ప్రయోగశాల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఎక్స్-రే విస్తృతశ్రేణి ఉపయోగాలను కలిగి ఉందని, దీనిని వివిధ అనువర్తనాలలో వినియోగించవచ్చని చెప్పారు. ఎలక్ట్రానిక్ బీమ్ని ఏ మూలాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారో, ఆ మూలం ఆధారంగా ఎక్స్-కిరణాలు బయటకు వస్తాయన్నారు. ఈ ప్రయోగశాలను తలుపులు మూశాకే వినియోగించాలని,ఇది అధిక ఉష్ణోగ్రతను విడుదలచేసి త్వరగా వేడెక్కుతుంది కాబట్టి, దానిని చల్లబరచేందుకు ప్రయోగం నిర్వహించినంత సేపూ చల్లటి నీరు ప్రవహిస్తూనే ఉండాలని డాక్టర్ శర్మ స్పష్టీకరించారు. పొరపాటున ఆ ఎక్స్-రే కిరణాలు చర్మంపై పడితే అది క్యాన్సర్కు కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు.గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రతాప్ పీఎస్ఆర్డీ వల్ల ఒనగూడే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.తొలుత, వర్క్షాప్ చెర్జ్డ్ పర్సన్ ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల ఈ ప్రయోగశాలను పొందడానికి చేసిన కృషిని వివరిస్తూ, సగం ధనాన్ని క్రిస్టల్లోగ్రఫీ ఇండియా వారిచ్చినట్టు చెప్పారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం దీనిని స్వాగతిస్తూ, మంచి పరిశోధనా వాతావరణం లభించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. వర్క్షాప్ లక్ష్యాలను కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ ఎం. సురేంద్రబాబు వివరించగా, డాక్టర్ నరేష్ కుమార్ కటారి, డాక్టర్ ఉమాదేవి ఈ కార్యశాలను సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *