పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనను నిరసిస్తూ అమాయక గిరిజన మహిళపై విచక్షణ రహితంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులను ఉద్యోగాలనుంచి తొలగించి చట్టపరమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని,ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన పట్ల గిరిజన మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించకపోవడం బాధాకరమైన విషయం అని అన్నారు. బంజారా జాతిలోనే పుట్టి ఒక స్త్రీ కి ఇంత అన్యాయం జరిగితే ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని ఆమె మంత్రి హోదాలో ఉండి కూడా ప్రయోజనం లేదని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని లేనియెడల రాష్ట్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు రాస్తారోకోలు నిర్వహిస్తామని జివిఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నేతలు హనుమాన్ గండి తండా ఉపసర్పంచ్ కమల్ నాయక్,మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు నిల్యా నాయక్, రవీందర్ నాయక్, వెంకట్ నాయక్, అరుణ్, లక్ష్మీబాయి, రమణ బాయి తదితరులు పాల్గొన్నారు.



