ఓపీ బుక్ లో స్టాంప్ లేదంటూ వెళ్లగొట్టిన వైనం
కడుపు నొప్పితో బాధపడుతూ వెనుదిరిగిన మహిళ
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 08 : ఓపీ బుక్ కో స్టాంప్ వేయించుకో లేదని కడుపునొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందించకుండా వెళ్లగొట్టిన ఘటన బుధవారంనగరంలో గాంధీని దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఎస్.లావణ్య అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో బుధవారం హైదరాబాద్ గాంధీ దవాఖానకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు ఓపీ స్లిప్ తీసుకుని క్యూలో నిలబడింది. రెండు గంటలు క్యూలో నిలబడి గైనకాలజీ విభాగం రూం నెం.32లో డాక్టర్ వద్దకు చేరుకోగానే బుక్ లో స్టాంప్ లేదని అక్కడ ఉన్న సిబ్బంది వెనక్కి పంపించారని వాపోయింది. ఓపీ స్లిప్ లో స్టాంప్ ఉన్నప్పటికీ బుక్కులో స్టాంపు లేదని వెళ్లగొట్టారంది. స్టాంపు వేయించుకోవాలని తెలియదా చదువుకోలేదా, తెలివి లేదా అంటూ కేకలు వేస్తు వెళ్ళగొట్టరాని, దూర ప్రాంతం నుంచి వచ్చామని అన్నా కూడా కనికరం చూపలేదని వాపోయింది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారికి దవాఖాన నిబంధనలు ఎలా తెలుస్తాయి అని బాధిత మహిళ వాపోయింది. పేదవారు ప్రైవేటు దవాఖానాల్లోకి వెళ్తే అక్కడ టెస్టులు, స్కానింగ్, ఓపికీ వేలాది రూపాయలు దండుకుంటున్నారని ప్రభుత్వ దవాఖానలకు వస్తే సిబ్బంది డాక్టర్లు మాత్రం రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటికే ఓపీ సమయం అయిపోవడంతో వెనుదిరిగి ఇంటికి పోయామనివాపోయింది.
ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తున్నా పేదలకు అందని వైద్యం
పేదల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు చేస్తున్నప్పటికీ, కొందరు వైద్యాధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం వలన పేరు పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదు. మంచి వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రాజధానికి వస్తే పేరున్న ప్రభుత్వ దవాఖానాల్లోనూ అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.




