గవర్నర్ తమిళిసై రాజీనామా

ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు
రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ
రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ

హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18:  గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమిళసై పోటీ చేస్తారని తెలుస్తున్నది. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019, సెప్టెంబర్ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గతకొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణకు గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెప్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు.

గవర్నర్ పదవి చేపట్టడానికి ముందు తమిళనాడు బీజేపీ చీఫ్గా వ్యవహరించిన ఆమె ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి లోక్సభ బరిలోకి దిగనున్నారని సమాచారం. ఆమె రాజీనామాను రాజ్భవన్ కూడా ధృవీకరించింది. మూడేళ్ల పాటు తెలంగాణకు గవర్నర్గా వ్యవహరించిన తమిళిసై రాజీనామా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. గత సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా ఆమె రాజీనామా చేయాలని కూడా ఆమె చెప్పలేదు. తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. 2019లో తెలంగాణకు తమిళిసై గవర్నర్గా వచ్చారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్ తమిళిసై కావడం విశేషం. మూడేళ్లకు పైగా తెలంగాణలో గవర్నర్ గా విధులు నిర్వర్తించారు.

గవర్నర్గా ఉండి రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఘనత కూడా తమిళిసైదే. రాజ్భవన్ ముందు ఫిర్యాదు బాక్స్ పెట్టిన తొలి గవర్నర్గా ప్రసిద్ధి చెందారు. గిరిజన విద్యార్థులకు అండగా నిలిచారు. తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో.. ఏదో ఒకచోట పోటీ చేసే యోచనలో ఉన్నారు. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై తిరునల్వేలి, కన్యాకుమారి నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. దీనికి కారణం అక్కడ సొంత సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *