వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారము అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోషణ మాసం పై ఇంటింటా పోషణ సంబరాలు – పోషణకు ఐదు సూత్రాలు అను పోస్టర్ ను సంబంధిత శాఖ అధికారులతో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారము, త్రాగునీరు, పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ప్రతి ఇళ్ళు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారు మ్రోగేలా చెయ్యాలని, జన చైత్యన్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ప్రతి తల్లికి బిడ్డకు సరైన పోషణతో పాటు మంచి ఆరోగ్యం ఉండాలని అన్నారు. గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కాన్పులు అయ్యేవరకు పర్యవేక్షణ సాగిస్తూ పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలితా కుమారి మాట్లాడుతూ, పోషణ మాసం సెప్టెంబర్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో (కొడంగల్, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్) నందు 1107 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని మొత్తం ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణీలు:7007, బాలింతలు:3896, జీరో టు మూడు సంవత్సరాల పిల్లలు:34586, మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లల సంఖ్య:21596 లబ్ధి పొందుతున్నారని ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని.రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని అంటే పప్పులు, ఆకుపచ్చ పాలకూర, పండ్లు, పాలు, పెరుగు, పన్నీర్ మరియు మాంసాహారులైతే గుడ్లు, మాంసం మరియు చేపలు తినాలని, నిమ్మకాయ, ఉసిరికాయ, జామకాయ మరియు ఇతర పుల్లటి పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరంలోకి ఇనుము బాగా వస్తుందని, విరోచనాలను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటిలో పరిశుభ్రత,ఆహారంలో పరిశుభ్రత పాటించాలని, సురక్షితమైన తాగునీరు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైన్ కలెక్టర్ నారాయన్ అమిత్, డిఆర్డిఓ కృష్ణన్, డిపిఓ తరుణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




