ఎన్ని చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలపై సుప్రీమ్ కోర్టు స్టే
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆర్‌ఎన్‌ఎ) : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీమ్ కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాది అంగీకరించారు. కానీ, అవి డిపాజిట్లు కాదని, సేవింగ్స్ అకౌంట్స్ కావడం వల్లనే వెల్లడించలేదని చెప్పారు. అవి కూడా కృష్ణమోహన్ రెడ్డి భార్య పేరు మీద ఉన్నాయని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెందిన స్థలాన్ని గతంలోనే విక్రయించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలు కోర్టుకు అందజేశారు. అనంతరం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం సెప్టెంబర్ 24న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. వాదనలు విన్న సుప్రీమ్ కోర్టు…తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది.




