గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు..

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: సారలమ్మ రాకతో మేడారం మహా జాతర తొలి ఘట్టానికి పునాదులు పడ్డాయి. తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామం నుంచి  సాయంత్రం ఐదు గంటల సమయంలో సమ్మక్క కూతురు అయిన  సారలమ్మను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పీవో అంకిత్‌, ఎస్పీ శబరీష్‌ ల ఆధ్వర్యంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సారలమ్మను భారీ బందోబస్తు నడుమ తీసుకువచ్చి మేడారంలోని సారలమ్మ గద్దెలపై సాయంత్రం 9 గంటల సమయంలో ప్రతిష్టింపజేశారు. దీంతో మేడారం మహా జాతర తొలి ఘట్టం మొదలైంది. కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయంలో మహా జాతర ప్రారంభానికి సుమారు 15 రోజుల నుంచి గుడి ఆవరణను గిరిజన సాంప్రదాయాల ప్రకారం శుద్ధి చేశారు. ప్రధాన పూజారులు  ఉపవాసాలు ఉంటూ సారలమ్మను ప్రత్యేకంగా పూజించారు.

సమ్మక్క ఆగమనానికి ముందు రోజు  బుధవారం రోజున సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారి కాక సారయ్య, అతనికి సహాయకులుగా కాక కిరణ్‌, కాక వెంకటేశ్వర్లు వ్యవహరించారు. సోలెం వెంకన్న అంగరక్షకుడిగా ఉంటూ, బొంది లక్ష్మయ్య, కాక భుజంగరావులు ధూప దీప నైవేద్యాల నడుమ డోలు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా సారలమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సారలమ్మ రాక కన్నుల పండుగగా, శతకోటి భక్తుల శరణు ఘోషతో సారలమ్మను ఆగమనం చేశారు. కాగా గంగారం మండలం పూనుగుల్ల గ్రామం నుంచి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు బయలుదేరాడు. మంగళవారం సాయంత్రం నుంచి కాలినడకన బయలుదేరిన పగిడిద్దరాజు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పూజారులు అయిన సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పగిడిద్దరాజుని మేడారం గద్దెల ప్రాంగణంలో ఉన్న పగిడిద్దరాజు గద్దెపై ప్రతిష్ఠించారు.

– సమ్మక్క మరిది (పగిడిద్దరాజు తమ్ముడు) అయిన గోవిందరాజులను ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల ప్రధాన పూజారి అయిన దబ్బగట్ల గోవర్ధన్‌ గోవిందరాజులను ఊరేగింపుగా తీసుకువచ్చి మేడారం గద్దెలపై ప్రతిష్ఠించారు.ఈ తొలి మహాఘట్టంలో గోవిందరాజుల ప్రధాన పూజారులు దబ్బకట్ల వంశస్థులు, వడ్డెలుగా కాక వంశస్థులు తరతరాల నుండి గోవిందరాజుల ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొంటున్నారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కొండాయి గ్రామం నుంచి బయలుదేరిన గోవిందరాజులు ఊరట్టం మీదుగా రాత్రి 9 గంటలకు మేడారంలోని సమ్మక్క సారలమ్మల ఆలయ ప్రాంగణంలో నున్న గోవిందరాజుల గద్దెపై అత్యంత వైభవంగా గ్రామస్తుల, భక్తుల సమక్షంలో ప్రతిష్ఠింపజేశారు. దీంతో జాతర తొలి ఘట్టం విజయవంతంగా పూర్తయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *