గద్దెపైకి చేరిన సారలమ్మ

అమ్మవారి రాకతో మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం
ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
జనసంద్రమైన గద్దెల ప్రాంగణం
విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్న మేడారం..
శివాలెత్తిన భక్తజనం..సారలమ్మకు భక్తి  శ్రద్ధలతో మొక్కులు
(మండువ రవీందర్‌రావు)
మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. సారలమ్మ రాకతో జాతర ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. జాతరలో మొదటి ఘట్టం సారలమ్మ గద్దెకు చేరుకోవడం కాగా, మరుసటి రోజున సమ్మక్క గద్దెకు చేరుకోవడం పరిపూర్ణమవుతుంది. జాతరకు రెండు వారాల ముందు నుంచే సంబంధిత పూజరులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవార్లకు సేవ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఆనవాయితీ. మేడారం గ్రామానికి పశ్చిమతీరాన సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను గద్దె ప్రాంగణానికి తీసుకువచ్చే వరకు చాలా పొద్దుపోయింది. ముందుగా కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక గ్రామస్థులు చీరె సారెలు, పసుపు కుంకుమలతో సమర్పించి అమ్మవారిని మేడారానికి తరలించారు. అయితే దారి మధ్యలో ఉన్న జంపన్నవాగు గుండా వస్తున్న క్రమంలో అక్కడ జంపన్న గద్దె వద్ద కాసేపు తమ ఆచారం ప్రకారం కార్యక్రమాన్ని ముగించి మేడారం బయలుదేరిన సందర్భంగా మేళతాళాలు, శివసత్తుల పూనకాలు ఒకపక్కన, మరోపక్కన సంతానం కోసం దారికి అడ్డంగా సాష్టాంగంగా అడ్డం పడుకోగా, ఇంకొందరు బిందెలతో దారిలో నీళ్లు గుమ్మరించి తమ భక్తిని చాటుకున్నారు. అంతకు ముందే సారలమ్మ పూజారుల కుటుంబంలోని మహిళలు మేడారంలోని సారలమ్మ గద్దెను చేరుకుని గద్దెలను అలికి శుభ్రంచేసి, ముగ్గులు పెట్టారు. ఇదే సమయంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దెకు చేరుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం నుండి మంగళవారమే పగిడిద్దరాజును మేడారానికి తీసుకువచ్చే కార్యక్రమం ప్రధాన పూజారి పెనక రాజేశ్వర్‌తోపాటు పెనక సురేందర్‌ ఆధ్వర్యంలో కొనసాగింది.  పగిడిద్దరాజు గుడి నుంచి మేడారానికి ఉన్న దాదాపు 80 కిలోమీటర్ల దూరం పూజారులు నడుచుకుంటూ బుధవారం మేడారం చేరుకున్నారు. ఇక్కడ కూడా మేడారంలోని పగిడిద్దరాజు గద్దెను పూజారుల కుటుంబానికి చెందిన మహిళలు అలికి, ముగ్గులు వేసి అంతకుముందే సిద్ధం చేసిపెట్టారు.
జంపన్నవాగు ద్వారా పగిడిద్దరాజును తరలిస్తున్న క్రమంలో కూడా మహిళా భక్తులు బిందెలతో దారిపొడవున నీళ్ళు గుమ్మరించి తమ భక్తిని చాటుకున్నారు. పగిడిద్దరాజును మేడారంలోని గద్దెకు తరలించిన తర్వాత ఆయన్ను పెండ్లి కుమారిడిగా పూజారులు అలంకరించారు. అలాగే ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజులును బుధవారం సాయంత్రం కల్లా గద్దెకు చేర్చారు. ఇక్కడ కూడా ప్రధాన పూజారి డబ్బగట్ల గోవర్థన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి ఈ పూజలు జరుగగా, కాలినడకన బుధవారం రాత్రి వరకు మేడారం చేర్చారు.  పూజారి కుటుంబానికి చెందిన మహిళలు మేడారంలోని గోవిందరాజుల గద్దెను శుభ్రం చేసి,అలికి ముగ్గులు పెట్టారు. అలాగె పడిగ రూపంలో ఉన్న జంపన్నను, జంపన్న వాగు పక్కనే ఉన్న గుడిలోనే పూజాదికాలు నిర్వహించిన అనంతరం మేళతాళలు, డోలు వాయిద్యాలతో మేడారంలోని గద్దెకు చేర్చారు. ముగ్గురు  దేవతలు మేడారంలో కొలువుదీరడంతో బుధవారం నాటి కార్యక్రమం పూర్తయింది.  దీంతో భక్తులు పోటీలుపడి అమ్మ, ఆయ్యవార్ల దర్శనం చేసుకోవడానికి దూసుకురావడంతో వత్తిడి పెరిగింది. కాగా గురువారం సమ్మక్కను తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు. గురువారం సకల దేవతలు కొలువుదీరే వేళ అందరినీ ఒకేసారి దర్శనం చేసుకునేందుకు భక్తులు గత రెండు మూడు రోజులుగా అక్కడే టెంట్లు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీతో మరికొందరు తమ మొక్కుబడులను ముందస్తుగానే తీర్చుకుని వెళ్తున్నారు.
సారలమ్మకు మంత్రి సీతక్క పూజలు
మేడారం,  ఫిబ్రవరి 21: మేడారం జాతరలో కీలక ఘట్టమైన కన్నెపల్లి నుంచి గద్దెపైకి  సారలమ్మ మేడారం గద్దెపై కొలువుదీరనున్న సందర్భంగా  పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క)  బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గారావు ఇంటికి వెళ్లి ఆలయ శుద్ధి గురించి చర్చించిన మంత్రి అనంతరం సమ్మక్క సారలమ్మ గర్భగుడి నుండి గద్దెలకు చేరుకొని కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసి పూజారులు అమరేందర్‌ కృష్ణయ్య, రామయ్య , మహేష్‌, నితిన్‌ ,స్వామి బాబురావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం
మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. దీంతో గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.  సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరగా, నేడు  సమ్మక్క తల్లి గద్దెల మీదకు చేరుకోనుంది. ఈ సందర్బంగా భక్తులు తమ మొక్కులను చెల్లించడానికి  వివిధ ప్రాంతాల నుండి మేడారం చేరుకున్నారు. బుధవారం వేకువజామున  నుంచే భక్తులు క్యూ ల్కెన్లకు చేరుకొని తల్లుల దర్శనానికి తరలివచ్చారు. భక్తులు వారి నిలువెత్తు బంగారం (బెల్లం) ను తల్లులకు సమర్పించారు.

అనంతరం ఎదుర్కొల్లు ఎగిరేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. సల్లంగా చూడు సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి అంటూ భక్తుల నినాదాలతో మేడారమంతా మారుమ్రోగిపోయింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో మేడారం పురవీధులు, మైదాన ప్రాంతాలు అన్ని భక్తులతో కళకళలాడుతున్నాయి. సాయంత్రం పూనుగుల్ల నుండి పగిడిద్దరాజులు, కన్నేపల్లి నుండి సారలమ్మ, కొండాయి నుండి గోవిందరాజులు  గద్దె మీదకు వచ్చిన సందర్భంగా  గ్రామస్తులు వారి సాంప్రదాయల ప్రకారం గద్దెల వద్ద విశేష పూజలను నిర్వహించారు. ఇందుకు దేవాదాయ శాఖ, పోలీస్‌, రెవెన్యూ శాఖ అధికారులు  అన్ని ఏర్పాట్లు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *