గత అనుభవాలు…భవిష్యత్తుకు మార్గ నిర్దేశకాలు!

కాలచక్ర పరిభ్రమణంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి. క్యాలెండర్లు మారుతున్నా కాలం మాత్రం ఆగదు. తరాలు గతిస్తున్నా మానవుల మధ్య  వైరుధ్యాలు, వైషమ్యాలు సమసి పోవడం లేదు. కాలవాహినిలో కలిసిపోయే ప్రతీ సంవత్సరం ఎన్నో అనుభవాలను మనకు గురుతుగా మిగిల్చి, మరో సంవత్సరానికి దారిచూపిస్తూ, తాను వీడ్కోలు గైకొంటూ, నూతన సంవత్సరానికి స్వాగత గీతిక పలుకుతూ నిష్క్రమించడం సహజమైన ప్రక్రియ .ప్రతీ సంవత్సరం ఎన్నో ఆశలతో జన జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని ఆశించడం సహజం. నూతన సంవత్సరానికి ఘనమైన ఆహ్వానం అందించడం ఆనవాయితీ. పాత సంవత్సరం లో ఎదురైన కష్టాలు కొత్త సంవత్సరంలో పునారావృతం  కాకూడదని, కొత్త సంవత్సరంలో కోటి సుఖాలు కలగాలని ఆశిస్తూ సంబరంగా వేడుకలు జరుపుకోవడం ఒక సాంప్రదాయం,సరదా. తెల్లారక ముందే బంధుమిత్రులకు  శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ,ఆనందంగా  వేడుకలు జరుపుకోవడం భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్ఫథాన్ని తెలియ చేస్తున్నది.

తూరుపు రేఖలు  విచ్చుకుని భూమాతకు వందనం సమర్పిస్తూ నూతన సంవత్సరపు శోభను పుడమికి కానుకగా అందిస్తున్న  తరుణంలో  జన జీవన స్రవంతిలో క్రొంగొత్త వెలుగు ప్రసరించాలని ఆశించడం అత్యాశ కాబోదు. అయితే మన ఆశలు, ఆలోచనలు సక్రమంగా ఉండాలి. మానవ సంబంధాలు, మానవీయ విలువలు సమాజంలో విరివిగా  పెంపొందాలి.మానవ జీవితం విచిత్రమైనది. పుట్టడం,గిట్టడం సహజమైన ప్రక్రియలు. స్వల్ఫమైన మానవ జీవితంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రతికిన కొద్దికాలంలో నిజాయితీగా నిస్వార్థంగా, ఎవరినీ వేధించకుండా, హింసించకుండా, పరులను వంచించకుండా మానవీయ విలువలతో నిండైన వ్యక్తిత్వంతో  గడపాలి.అయితే నేటి సమాజంలో స్వార్ధం విపరీతంగా పెరిగిపోవడం, కాసుల కక్కుర్తితో  మోసాలు పెరిగిపోవడం,అవినీతి ఆకాశానికంటడం వంటి చర్యలను చూస్తున్నాం. మానవ జీవిత విధానంలో చోటు చేసుకుంటున్న వికృత పరిణామాలకు గల కారణం దురాశ,ధనాపేక్ష.గుప్పెడు మెతుకులు తిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కుడా తరతరాల కోసం ఆస్తులను కూడబెట్టడం, అందుకోసం అడ్డదారులు అన్వేషించడం,ఇతరులను వంచించి,జీవించడంలో మానసికానందం అనుభవించడం  ఒక  మానసిక రుగ్మత గా భావించాలి. హింస, అరాచకాలు దానవత్వానికి ప్రతీక.ఇలాంటి   దుశ్చర్యలకు స్వస్తి వాక్యం పలకాలి.

ప్రతీ సంవత్సరం చక్కగా సాగాలని, మంచి ఆలోచనలతో, ప్రణాళికలతో సమాజ వికాసం జరగాలని కోరుకోవాలి.నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతీ ఒక్కరూ  తమ జీవితాశయాల సాధన కోసం పాటుపడాలనే ప్రేరణతో  అట్టహాసంగా కొన్ని ప్రణాళికలను సంసిద్ధం చేసుకోవడం ఏటా జరుగుతున్న ఒక ఆర్భాటపు ప్రహసనం గానే చెప్పవచ్చు. మన ఆలోచనలు బలంగా లేకపోవడం,మన ఆశయాలకు చిత్తశుద్ధి,సంకల్పబలం లోపించడం వలన కార్యాచరణ నీరుగారిపోవడం వలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా యథాతథ పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఇకనైనా ఇలాంటి పరిస్థితులు మారాలి.  ప్రపంచంలోను, మన దేశంలోను పాత సంవత్సరంలో అనేక సంఘటనలు జరిగాయి. అందులో  కొన్ని స్వాగతించదగ్గవి. మరికొన్ని ఖండిరచవలసినవి కూడా ఉన్నాయి. ఉక్రెయిన్‌ పై రష్యా 2022 ఫిబ్రవరిలో ప్రారంభించిన యుద్ధం 2023 లో కూడా కొనసాగడం, దీని ప్రభావం వలన పలుదేశాలు తీవ్రమైన ఇబ్బందులకు గురికావడం జరిగింది. 2024 లో నైనా ఈ యుద్ధానికి చరమగీతం పాడాలి. 2023 వ సంవత్సరంలో  ప్రపంచంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఏర్పడిరది.అగ్రరాజ్యాలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.పలుదేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయాయి.  పాకిస్థాన్‌ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడిరది. పాక్‌ లో ఆకలి కేకలు మిన్నంటాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌ లో ప్రజలు ఆహారం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. పాక్‌ లోని పలు ప్రాంతాల ప్రజలు భారత్‌ కు మద్దతు ప్రకటించడం,పాక్‌ ను భారత్‌ లో విలీనం చేయాలనే వాదన అక్కడి ప్రజల్లో బయలు దేరింది. ఇక  ఇజ్రాయిల్‌ విషయానికొస్తే, పాలస్తీనా కు చెందిన మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ ఇజ్రాయిల్‌ పై  దాడి చేసి నరమేథానికి పాల్పడిరది. ఈ సంఘటనలో రక్తం ఏరులై పారింది. గాజాలో ఇజ్రాయిల్‌ సైనికుల దాడుల్లో వేలాది మంది పాలస్తీనీయులు మరణించడం, ఇందులో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలు కావడం అత్యంత బాధాకరం.

చిరకాలంగా నలుగుతున్న పాలస్తీనా- ఇజ్రాయిల్‌ సమస్యకు ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా లాంటి దేశాలు ఇకనైనా పరిష్కారం చూపాలని శాంతి కాముకుల ఆశ. ఈ సంవత్సరం భారత్‌ లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే,భారత్‌ లో జమ్మూ కాశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి కల్పించే  ఆర్టికల్‌ 370 పై  సర్వోన్నత న్యాయస్థానం భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పునివ్వడం జరిగింది.అంతకు ముందే   జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, లఢక్‌  కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన విషయం విదితమే. జమ్మూ కాశ్మీర్‌ లో శాంతి సుస్థిరతలు నెలకొని, ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. ఇక మిగిలిన విషయాల్లోకి వద్దాం. ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యం ఎదుర్కొంటున్న దశలో భారత దేశం ఐదవ ఆర్ధిక వ్యవస్థ గా రూపాంతరం చెందడం విశేషం.  అయోధ్య సంగతి కొస్తే,ఎన్నో మత కలహాలతో, మరెన్నో కోర్టు వివిదాలతో దద్దరిల్లిన అయోధ్య అంశం 2024 జనవరి 22 వ తేదీ రామాలయ నిర్మాణ ప్రారంభోత్సవంతో పరిసమాప్తి కాబోవడం విశేషం.ఇకనైనా భారత దేశం సకల మత సమాహారంగా, సౌభ్రతృత్వ వాతావరణంలో వర్దిల్లాలని ఆశించాలి.’’రత్నభూమి’’ గా పిలవబడే మణిపూర్‌ లోని మెయిటీలు,కుకీలు,నాగాల  మధ్య జాతుల వైరాన్ని పరిష్కరించాలి.  ఇక రాజకీయ విషయాల సంగతి పరిశీలిస్తే,దాదాపు10 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టి, ఈ నూతన సంవత్సరంలో  జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి నాయకత్వం వహించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది. మూడవసారి అధికారం లోకి రావడానికి బి.జె.పి నేతృత్వం లోని ఎన్‌.డి.ఏ  విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఇక ఆంధ్రప్రదేశ్‌ లో  ఎన్నడూ లేని విధంగా టి.డి.పి, జనసేన కూటమికి  వై.సి.పి కి మధ్య హోరా హోరీ ఎన్నికల పోరుకు 2024 వ సంవత్సరం వేదిక కానుంది.2023 వ  సంవత్సరంలో భారత దేశంలో  ఒకటి రెండు సంఘటనలు మినహా దాదాపుగా జన జీవనం ప్రశాంతంగానే సాగింది. రాజకీయ పరమైన వైరుధ్యాలే తప్ప ప్రజల్లో ఎలాంటి శతృత్వ భావన లేదు. పాత సంవత్సరం అనుభవాల సమాహారం. పాత సంవత్సరపు  అనుభవాలు కొత్త సంవత్సరపు  ఆలోచనలు  ఎలా సాగాలో నిర్ధేశించుకోవడానికి మార్గం సుగమం చేయాలి. సహజ వనరులను, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుని, 2024 వ సంవత్సరంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగాలి. ఆర్ధికంగా బలోపేతం కావాలని ఆశిద్ధాం.
-సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు)
9704903463.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *