త్వరలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో స్పెషల్ లంచ్ మీటింగ్
అదే వేదిక ద్వారా పోటీపై క్లారిటీ
పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టనున్న గులాబీ దళపతి
ఎ.సత్యనారాయణరెడ్డి, ప్రజాతంత్ర ప్రతినిధి
మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రేస్ గుర్రాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ గడ్డపై నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలిచేదెవరూ అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు…వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచే, గెలిచే వారి జాబితాను కూడా రె‘ఢీ’ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే…ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిన పార్టీలన్నీ ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ సీటు ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఇక్కడి నుంచి ప్రస్తుతం సిఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటం. అయితే, ఈసారి అక్కడ్నుంచి ఎవరు బరిలో ఉంటారు..? గతంలో మాదిరిగానే గులాబీ బాస్ బరిలో ఉంటే…ప్రత్యర్థిగా ఎవర్ని దించాలి..? కేసీఆర్ టార్గెట్‌గా కీలక నేతలు బరిలోకి దిగుతారా..? అదే జరిగితే పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. ఓ వైపు కేసీఆర్‌పై ఎవరిని పోటీకి దింపాలని ఆలోచన చేస్తూనే…మరోవైపు రానున్న ఎన్నికలో సిఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయరంటూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొత్త పల్లవిని ఎత్తుకున్నాడు. కేసీఆర్ గజ్వేల్ నుండి కాకుండా, రానున్న ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు కొత్త ప్రచారానికి తెరలేపారు. మీడియాలో కూడా వార్తలొస్తున్నాయి. అయితే, దుష్ప్రచారాలను, పుకార్లను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్టివేస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ క్యాడర్‌ను, ప్రజలను కన్ఫ్యూజన్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు మైండ్‌గేమ్‌ను మొదలుపెట్టారనీ, ఈ ప్రచారాన్ని పట్టించుకోవల్సిన అవసరం లేదనీ బిఆర్ఎస్కు చెందిన సీనియర్ నాయకుడు, సిఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ నేత గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ చెప్పారు. వొచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్ గజ్వేల్ నుండే పోటీలో ఉంటారనీ, ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దంటున్నారు. కేసీఆర్ పోటీపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి, పార్టీ క్యాడర్ అయోమయానికి గురి కాకుండా ఉండేందుకు సిఎం కేసీఆరే త్వరలోనే క్లారిటీ ఇస్తారనీ, అప్పటి వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దన్నారు.




