కూకట్ పల్లి,ప్రజాతంత్ర, నవంబర్ 24 : కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని ‘తులసి ద్వాదశి’ అని కూడా అంటూ వుంటారు. ఈ రోజున తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని న్యూ బోయినపల్లిలోని పాత విమానాశ్రయం సమీపంలోని శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధినీ సంస్కృత కళాశాల, పాఠశాలలో ప్రధానాచార్యులు డాక్టర్ భానోత్ సురేంద్ర ఆధ్వర్యంలో తిరుపతి నుండి విచ్చేసిన వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, తులసీదామోదర కళ్యాణం, సత్యనారాయణ స్వామివారి వ్రతం తదితర పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రాంగణం మొత్తం పూజా కార్యక్రమాలు, భక్తి, భజన పాటలతో సందడి నెలకొంది. పూజ కార్యక్రమం అనంతరం భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వన భోజనాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ విద్యారణ్య స్వామి, దీనబందు కాలనీ అధ్యక్షుడు మహేందర్ నాయక్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
క్షీరాబ్ది ద్వాదశి తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి





