- ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- విశాఖ మన్యంలో మంచు తెరలు
విశాఖపట్టణం, డిసెంబర్ 8 : ఏజెన్సీల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఎపి రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రిపూట భూ వాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకూ అదనంగా పెరిగిందని తెలిపారు. లంబసింగిలో అందాలు ఆరబోస్తున్నాయి. మబ్బులు భూమిని కమ్మేస్తున్నాయి. విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. దీనికితోడు చలిపంజా విసరుతోంది. ఈ అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఏజెన్సీలకి వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. సాయంత్రం నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది.
రాత్రిపూట, తెల్లవారుజాము ఈ సీజన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీస్తున్న కారణంగా జిల్లాలో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని వాతావరణ అధికారులు అన్నారు. ఈ ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి. రాత్రి, ఉదయం సమయాల్లో కంటే తెల్లవారుజామున అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటవీ ప్రాంతం కావడంతో చలికితోడు పొగమంచు సమస్య తీవ్రంగా ఉంది. రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో దారి కనిపించడం లేదు. దీంతో ఉదయం 7 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే వాతావరణంలో ఈ సారి మార్పులు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.



