క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై ఈడి అధికారులు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను బుధవారం ప్రశ్నించారు. వీరిని మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఎల్ రమణకు ఈడీ అధికారులు సూచించారు. చికోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో కేసులో ఈడి మరోసారి దూకుడు పెంచింది. చికొటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో ఆడించినట్టు అధికారులు గుర్తించడంతో.. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. అయితే.. ఈ కేసులో మనీ ల్యాండరింగ్, లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లుగా గుర్తించిన వెంటనే అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలోనే ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరుల పేర్లు బయటకొచ్చాయి. తలసాని సోదరులు మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌ను పిలిచి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. చికోటి ప్రవీణ్‌తో కలిసి ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లుగా ఇప్పటికే ఈడి అధికారులు గుర్తించారు. అయితే.. చికోటి ప్రవీణ్ జరిపిన లావాదేవీల్లో మహేష్, ధర్మేందర్ యాదవ్ పేర్లు రావడంతో అధికారులు వారిని పిలిచి విచారణ చేపట్టారు. హవాలా, ఫేమా ఉల్లంఘన కింద ఇద్దరినీ విచారిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో చాలామందిని విచారణకు పిలిచారు. కానీ.. ఇప్పుడు తలసాని సోదరులను పిలవడం చర్చనీయాంశం అయ్యింది.



