కండువా మార్చేస్తారు తేలికగా
ఛీకొట్టిన పార్టీకే జైకొడితే ఎలాగ?
వోటరుకి కుడిఎడమల దగాదగా
ఏ దిక్కులు చూడాలి ఎగాదిగా?
ప్రచార సడిలో హామీలు దండిగా
నెరవేర్చకపోతే ఎందుకవి దండగ?
వాగ్బాణం ఎక్కుపెడితె సూటిగా
లోగుట్టు బైటపడదా మొత్తంగా?
– వి.రమేష్ బాబు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ,దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో ఆ పార్టీ నిర్వహించిన బీసీ గర్జనలో పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల వారికి పూర్తి అండగా కేవలం బిజెపీ నే నిలబడిందని ..రాష్ట్రంలో తమ పార్టీ అధికారం లోకి వొస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు.బీఆర్ ఎస్ అధినేత,రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు చెన్నూరు, మంథని,పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. తమ పార్టీకి బాసులు దిల్లీ లో ఉండరనీ ..తెలంగాణా ప్రజలే తమ బాసు లని బీజేపీ,కాంగ్రెస్ పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కాంగ్రెస్ విజయ భేరి పేరుతొ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆలంపూర్ ,గద్వాల, మక్తల్ సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అధికారం లో ఉన్న బీఆర్ఎస్ నిజంగా 24 గం.లు కరంట్ ఇస్తుందని నిరూపిస్తే తను, అభ్యర్థి సంపత్ నామినేషన్ వేయమని సవాలు చేసారు. బీజేపీ ముఖ్య నాయకుడు ఈటల రాజేందర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసారు. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లేకుండానే సిపీఎం ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.





