- నేడు యశోదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
- నందినగర్ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. ఆయన హాస్పిటల్ నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో జారిపడడంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు ఆయనకు గత శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
ప్రస్తుతం కెసిఆర్ హాస్పిటల్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. సుమారు 6 రోజులుగా ఆయన చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో వైద్యులు ఇంటికి వెల్లడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. నేడు కేసీఆర్‌ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే వైద్య సేవల కోసం ఫామ్ హౌస్ దూరంగా ఉండటంతో.. ఆయన సిటీలోని తన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నందినగర్‌లో ఇంటిని యుద్ధ ప్రాతిపదికన బాగు చేసినట్లుగా తెలుస్తుంది.
కెసిఆర్ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించారు. కేంద్రమంత్రిగా ఉన్న సమయమంలోనూ కేసీఆర్ ఓ సారి దిల్లీలో బాత్ రూంలో జారి పడ్డారు. దాంతో అప్పుడు కూడా ఆయనకు తుంటి ఆపరేషన్ జరిగింది. ఈ సారి రెండో వైపు ఆపరేషన్ జరిగింది. అయినా కేసీఆర్ మానసికంగా ధృడంగా ఉన్నారని..హాస్పిటల్లో పుస్తకాలు చదువుతున్నారని ఎంపీ సంతోష్ రావు తెలిపారు.




