మోయినాబాద్ ఫామ్ హౌజ్‌లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్ హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో వొస్తున్న వార్తలన్నీ బిజెపిని టార్గెట్ చేసేవిగానే ఉండడంతో బిజెపి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం, రాజేంద్రనగర్ ఏసిపి, డిజిపి, సైబరాబాద్ సిపి, మోయినాబాద్ ఎస్‌హెచ్‌ఓతో సహా ఎనిమిది మందిని ప్రతివాదులగా చేర్చింది. వాస్తవాలు వెలుగుచూసేందుకు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాల్సిందిగా ఆ పిటీషన్‌లో భాజపా కోరింది. ఈ సంఘటన అంతా వాస్తవమేనా, లేక పాత్రలు, సన్నివేశాలతోపాటు దీని వెనుక డైరెక్షన్ ఎవరిదన్న విషయాలు వెల్లడికావాల్సి ఉంది. ఏదియేమైనా ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపిందనడంలో అతిశయోక్తి లేదు. మరో వారం రోజుల్లో మునిగోడు ఎన్నికలు జరుగనున్న వేళ సంచలనాత్మకంగా వెలుగు చూసిన ఈ ఘటన చివరకు ఎవరికి లాభిస్తుందో తెలియదుగాని, ప్రజలు మాత్రం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మవద్దన్న అయోమయంలో పడ్డారన్నది మాత్రం వాస్తవం.
మంగళవారం నుండి బుధవారం సాయంత్రం వరకు ఈ ఎపిసోడ్‌లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఇప్పటి వరకు కనిపిస్తున్నదానిలో బిజెపి వైపు వేలెత్తి చూపేదిగానే ఉండడంతో టిఆర్‌ఎస్, భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. తనపై పడిన అభాండాన్ని తొలగించుకునేందుకు భాజపా నేతలు నెత్తిన నోరు పెట్టుకుని వాదనలకు దిగుతున్నారు. ఫామ్ హౌజ్‌లో టిఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంఎల్‌ఏలను కొనుగోలుకు వొచ్చిన వారెవరో తమకు తెలియదని రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మొదలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నేతలు ఒక పక్క తీవ్రంగా ఖండిస్తుంటే, కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన కేంద్ర నాయకులతో వారికున్న సంబంధాలేమ్నిన్న విషయాన్ని తెలియజెప్పే ఫోటోలను తెలంగాణ నాయకులు, ఆ పార్టీకే చెందిన ఛానల్ పదేపదే చూపిస్తుండడంతో తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత బిజెపిపై పడింది. అందుకే ఆ పార్టీ సరాసరి హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిగేందుకు గాను సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేదా కేసును సిబిఐకి అప్పగించాలని ఆ పిటీషన్‌లో బిజెపి కోరింది. ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను కొనుగోలుకు వొచ్చినవారుగా చెబుతున్న స్వామీజీలు సింహయాజీ, రామచంద్రభారతిలకు వాస్తవంగా ఈ ఎపిసోడ్‌తో సంబంధం ఉందా? ఉంటే ఎవరి ప్రోత్భలంతో వారిక్కడికి వొచ్చారన్న విషయం తేలాల్సి ఉంది. వీరిద్దరికీ దిల్లీకి చెందిన బిజెపి అగ్రనేతలతో సంబంధాలున్నాయని వొస్తున్న వాదనలో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది. అయితే వీరికి దిల్లీ బిజెపి పెద్దలతో ఎలా సన్నిహితత్వం ఉందన్న ప్రచారం జరుగుతున్నదో, ఇటీవల ఆ పార్టీ నుండి టిఆర్‌ఎస్‌లోకి వొచ్చిన ఒక నేతతో కూడా దగ్గరి బంధం ఉన్నట్లుగా మరికొన్ని ఆరోపణలు వినవస్తున్నాయి.
అలాగే మరో నిందితుడిగా చెప్పబడుతున్న నందకుమార్ విషయంలో కూడా ఇరువర్గాల సంబంధాలు వెలుగులోకి వొస్తుండడంతో ఎవరికి తోచిన విధంగా వారు వారి చర్యలను అనువదించుకుంటున్నారు. గోలకొండ కోటపైన కాషాయ జంఢాను ఎగురవేస్తామని ఘంటాపథంగా చెబుతున్న బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు తమతో టచ్‌లో ఉంటున్నారన్న విషయాన్ని కూడా పదేపదే చెబుతుండడం వల్ల మోయినాబాద్ ఘటన బిజెపి సృష్టేనన్న అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. సైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిందుతులుగా భావిస్తున్న వారిని అరెస్టు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలకు డబ్బు, కాంట్రాక్టు, ఇతర పదవులను ఎరవేసి తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేసినట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పడంతో దీని వెనుక బిజెపి హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాలకు తావేర్పడింది. అంతేగాక తమను ప్రలోభ పెట్టేందుకు దిల్లీ, తిరుపతి నుండి వీరు వొచ్చారని, వారితో నగరానికి చెందిన మరో వ్యక్తి తమను బిజెపిలో చేరేందుకు ప్రలోభపెడుతున్నారన్న విషయాన్ని స్వయంగా ఎంఎల్‌ఏలు తెలియజేయటంతో తాము రంగంలోకి దిగినట్లుగా పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పిన తీరుపై పలు అనుమానాలను బిజెపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఫామ్ హౌజ్‌కు చెందిన తాండూరు ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్‌రెడ్డి అధ్వర్యంలోనే అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్ ఎంఎల్‌ఏలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి లతో మాటామంతి జరిగినట్లుగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ విచిత్రకరమైన అంశం ఏమిటంటే ఈ విషయాన్ని చెప్పడంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలో తడబాటు, వాస్తవంగా పట్టుకున్న డబ్బు ఎంత అన్న విషయాన్ని బాహాటంగా వెల్లడించకపోవడంపై బిజెపి నాయకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న వారు ఎంఎల్‌ఏలతో బేరసారాలాడుతున్న విషయానికి సంబంధించిన రికార్డు వాయిస్‌గాని, వీడియోగాని ఇంతవరకు బయటపెట్టకపోవడంతో మునుగోడు ఎన్నికల వేళ తమను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో చేసిన కుక్కుడ్ ఎపిసోడ్ అని బిజెపి అంటున్నది. తమ విచారణలోని వాస్తవాలను పోలీసులు గాని, ఏం జరిగిందన్న విషయాన్ని ఆ నలుగురు ఎంఎల్‌ఏలుగాని వెల్లడిస్తేనే ఆసలు విషయం బయటకు వొస్తుంది. కాని పక్షంలో న్యాయస్థానం పరిష్కరిస్తే తప్ప నిజం వెల్లడయ్యే అవకాశం లేదు.




