నాలిక కర్చుకోవడం నాయకులకు అలవాటైంది. అధికార గర్వంతో కొందరు రాజకీయ నాయకులు ఒక్కోసారి కనీస విచక్షణాజ్ఞానాన్నికోల్పోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఆ తర్వాత నాలిక కర్చుకోవడమన్నది వారికి అలవాటైపోయింది. రాజకీయాల్లో ఉన్న ప్పుడు కనీసమర్యాదలు పాటించాలన్న విచక్షణను కూడా కోల్పోతున్నారు. తమపై వొచ్చిన విమర్షలను ఎదుర్కునే విషయంలో నేర్పుగా సమాధానాలు చెప్పలేక అసహనానికి, ఆగ్రహానికి గురిఅవుతున్నారు. తాను అనని మాటలు అన్నట్లుగా ఎవరో సృష్టించారని ఆ నెపం ఎదుటివారిపై నెట్టే ప్రయత్న చేయడంకూడా సోకాల్డ్ రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. తన మాటలు వక్రీకరించారనో, మార్పిడి చేశారనో తప్పును సవరించుకునే ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తున్నాం. తాజాగా కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అదే పార్టీకి చెందిన చెరుకు సుధాకర్ మధ్య మాటల యుద్ధంకూడా ఇదే కోవకు చెందిందే. డా. చెరుకు సుధాకర్ అభిప్రాయం పై స్పందించే క్రమంలో వెంకట్‌రెడ్డి అన్నమాటలు మాత్రం శాంతికాముకులు, ప్రజాతంత్ర వాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోమటి రెడ్డి దురహంకార హెచ్చరికలు కాంగ్రెస్ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తున్నాయి. స్వీయపార్టీలోని వ్యక్తి ఒక విషయంపైన తన అభిప్రాయాన్ని చెబితే దానికి రియాక్షన్ ఇంత స్థాయిలో ఉంటుందా అన్న విషయంపైన ఇప్పుడు ఆ పార్టీలో సీరియస్ చర్చ జరుగుతోంది. అయితే పార్టీ హై కమాండ్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏమైనా తాఖీదు వొచ్చిందాలేదా తెలియదుకాని, ఆయన స్వరంలో మాత్రం మార్పు కనిపిస్తుంది. తాను ఏదో భావోద్వేగంతో మాట్లాడానేకాని, ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడిందికాదని ఇప్పుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తిట్టేదంతాతిట్టి ఇప్పుడు అన్యదా భావించవద్దనడం ఇలాంటి నాయకులకే చెల్లింది.
డా. చెరుకు సుధాకర్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన చెబుతున్నంత తేలికగా తీసివేసేవేమీ కాదు. ఆయన ను హత్యకు ప్రణాళిక సిద్దమైందని, మరో వారం రోజుల్లోనే చావు రాసిపెట్టి ఉందని ఫోన్లో సుధాకర్ కొడుకు సుహాస్‌తోనే తీవ్రాతి తీవ్ర పదజాలంతో మాట్లాడిన మాటలు వైరలైనవిషయం తెలిసిందే. ఆయనవిగా చెబుతున్న ఆ వాయిస్‌లోని మాటలు రాయడానికి అనువైనవిగా లేవంటే ఎలాంటి పరుషపదజాలం వాడి ఉంటాడో అర్థమవుతుంది. తన అభిమానులు నిన్ను కూడా అంటే సుధాకర్ కొడుకును కూడా మట్టుపెడుతారంటూ ఆగ్రహంగా మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేసేదిగా ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాయిస్ రికార్డు విన్నవాళ్ళంతా అది వెంటట్రెడ్డి వాయిస్‌కు చాలా దగ్గరగా ఉందంటున్నారు. దానికి తగినట్లు వెంకట్‌రెడ్డి కూడా తాను సుధాకర్ కుమారిడితో మాట్లాడిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటున్నాడు. అయితే తాను తనపైన వొస్తున్న ఆరోపణల విషయంలో సున్నితంగా మందలిచ్చానేగాని పరుషపదజాలం వాడలేదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాను భావోద్వేగంతో మాట్లాడానంటూనే, మరోపక్క తన మాటలను మార్ఫింగ్ చేశారంటూ వెంకట్‌రెడ్డి ద్వంద్వ ప్రకటనపై సుధాకర్ అనుచరవర్గం తీవ్రం అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్న సంస్కృతి తెలంగాణలో కూడా రావడమన్నది ఆవేదనను కలిగించేదిగా ఉంది.
హత్యా రాజకీయాలను ప్రేరేపించేవిగా ఉన్న వెంకట్‌రెడ్డి మాటలను వివిధ రాజీకీయ పార్టీల నేతలతోపాటు ప్రజాతంత్ర కూడా తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సద్విమర్షలను ఆహ్వానించవొచ్చుగాని, హింసా ప్రేరణకు చోటులేదన్న విషయాన్ని మరోసారి వారు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలాకాలంగా వివాదగ్రస్తులుగానే కొనసాగుతున్నారు. రాష్ట్రం ఏర్పడింది మొదలు వారి దృష్టి పార్టీ అధ్యక్ష పీఠం పైనే అన్నది స్పష్టం… కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు ఉన్నంత కాలం ఆయనను విమర్శిస్తూ నే ఉన్నారు…ఆఖరికి ఆయన వస్త్రధారణను కూడా విమర్శించే అధమ స్థాయికి దిగజారారు.కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు వీరు బహిరంగ విమర్శలు చేస్తూ వొచ్చారు. ఆ పదవిని తమకే ఇవ్వాలని చాలాకాలంగా పార్టీలో ఒక అన్చిత వాతావరణాన్ని కలిగించిన విషయం బహిరంగ రహస్యమే. పార్టీలోనే ఉంటూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వొచ్చారు. ఆఖరికి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన వ్యాపార ప్రయోజనాల కోసం బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. వెంకట్రెడ్డికూడా అదేదారిలో వెళ్తాడన్న ప్రచారం జరిగింది.
కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిగా రంగంలో ఉన్న తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని తన అనుచరులకు వెంకట్‌రెడ్డి చెప్పిన విడియో రికార్డు వైరల్ అయింది. దానిపై సమాధానం చెప్పాల్సిందిగా అధిష్ఠానం నోటీసులిచ్చిందేగాని ఎలాంటి క్రమ శిక్షణారాహిత్య చర్య తీసుకోలేదు. అయితే మునుగోడులో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, రాజగోపాల్రెడ్డివైపు పనిచేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో వెంకట్‌రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలని డా. చెరుకు సుధాకర్ డిమాండ్ చేయడం వెంకట్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న చెరుకు సుధాకర్ తన సీనియార్టీని లెక్క చేచకుండా మాట్లాడాడన్న ఉక్రోషంతో ఆయనపైన విరుచుకుపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని పూర్వపు స్థితికి తీసుకురావడానికి కష్టపడి పనిచేయాలని ఆ తర్వాతే పదవులను డిమాండ్ చేయాలని సిడబ్ల్యుసిలో చోటుకోసం ప్రయత్నిస్తున్న వెంకట్‌రెడ్డిని దృష్టిలోపెట్టుకుని సుధాకర్ అంటించిన చురక ఆయనకు నశాళానికి అంటినట్లై ఆయన నోరుపారేసుకోవడానికి కారణంగా మారింది. దీనిపై కాంగ్రెస్‌పార్టీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేసిన డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి, పీ డీ చట్టం కింద కారాగార శిక్షను అనుభవించిన ఏకైక ఉద్యమకారుడు.. అనేక ప్రజాసంఘాల పోరాటాలతో సన్నిహిత సంబంధం ఉన్న ఆయన పిడియాక్టు కింద అరెస్టు కాబడినప్పుడు యావత్ తెలంగాణ ఆయనకు మద్దతుగా నిలిచింది.. ఇప్పుడు ప్రజాతంత్ర ఆయనకు అండగా నిలుస్తుంది… తమ వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ ని అడ్డుపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేసే కోమటి రెడ్డి అన్నదమ్ముల ఆగడాలను తీవ్రంగా ఖండిస్తుంది.




