ఇద్దరు వ్యక్తులు అరెస్టు
నిషేధిత డ్రగ్స్ విలువ సుమారు రూ.10 లక్షలు
వివరాలను వెల్లడించిన మియాపూర్ ఏసిపి నరసింహారావు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 30:రామచంద్రాపురం మండలం కొల్లూరు పోలీసులు, ఎస్ఓటి మాదాపూర్ యాంటీ డ్రగ్ స్క్వాడ్ సంయుక్తంగా కొల్లూరు నుండి హైదరాబాద్ నగరానికి బాడీ బిల్డింగ్ కోసం నిషేధించబడిన ఇంజక్షన్లు, నిషేధించబడిన మాత్రల రవాణాను అడ్డుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు డ్రగ్ సప్లయర్‌లను పట్టుకుని, పెద్ద మొత్తంలో ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు, 1 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. వీటికి సంబంధించిన వివరాలను రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ కమిషనర్ రాజమౌళి, కొల్లూరు సీఐ సంజయ్ కుమార్ లతో కలిసి మియాపూర్ ఏసిపి నరసింహారావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొల్లూరు పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటి), మాదాపూర్ జోన్, యాంటీ డ్రగ్ టీమ్‌లతో కలిసి 02 డ్రగ్ సరఫరాదారులను పట్టుకున్నారు. అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్, మొహమ్మద్ ఇబ్రహీం ఇద్దరూ హైదరాబాద్ సిటీ చాంద్రాయణగుట్టకు చెందినవారని తెలిపారు. నిందితుడు అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ ఒక సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ఫిట్‌నెస్ క్లబ్ (జిమ్) యజమాని, అతని సంపాదన సరిపోలేదు. ఆ తర్వాత నిందితుడు నిషేధిత ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను విక్రయించాలని, తద్వారా వినియోగదారులను సులువుగా ఆకర్షించేలా, నిషేధిత ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను అధిక ధరలకు విక్రయించాలని పథకం పన్నాడని అన్నారు. అందుకని అతను నిషేధించబడిన ఇంజెక్షన్లు, టాబ్లెట్‌లను తనకు తెలిసిన మూలం నుండి ప్రతి బాటిల్‌కు రూ.300 కొనుగోలు చేసి, వాటిని రూ.1000 నుండి 1400 వరకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. మహమ్మద్ ఇబ్రహీం నిందితుడు, ఖాదర్ కింద పనిచేస్తున్న సరఫరాదారడని చెప్పారు. అబ్దుల్ ఖాదర్‌ను శాంపిల్ నిషేధిత ఇంజెక్షన్లు, టాబ్లెట్‌లతో పట్టుకోగా, విచారణలో అతను స్వచ్ఛందంగా నేరం చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. డ్రగ్స్‌ను చాంద్రాయణగుట్టలోని తన జిమ్‌లో ఉంచినట్లు చెప్పాడు. దీని ప్రకారం పోలీసులు చాంద్రాయణగుట్టలోని అతని జిమ్‌కు వెళ్లి అతని జిమ్‌లో మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఇలాంటి నిషేధిత డ్రగ్స్ ను ఎవరైనా అమ్మిన, వాడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని మియాపూర్ ఏసిపి పేర్కొన్నారు.



