సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణలో సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లన్నకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పాతికేళ్లుగా పన్ను చెల్లింపులు చేయలేదని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని సమాచారం. ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ సమర్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఏకంగా రూ.12 కోట్ల జరిమానా విధించినట్టు తెలుస్తోంది.దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి మూలంగానే మల్లన్న స్వామికి జరిమాన పడినట్లు తెలుస్తోంది నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ,దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించే అధికారే రిటర్న్స్ వ్యవహారం చూడాల్సి ఉండగా..
దేవస్థాన ఈవోలుగా పనిచేసిన వారు ఈ విషయాన్ని మర్చిపోయారు. దీంతో దాదాపు1995 నుండి ఐటి రిటర్న్స్ చేయలేదని తెలుస్తుంది. పలుమార్లు రిటర్న్స్ చేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ తో పాటు , ఆలయ కార్య నిర్వహణ అధికారికి సైతం నోటీసులు పంపినా..దేవాలయం అధికారులు పట్టించుకోలేదనీ, దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించి మల్లన్నకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖకుకొమురవెళ్లి మల్లికార్జున స్వామి దేవస్థానం వాస్తవంగా నేటికీ రూ.. 8,64,49,041 మాత్రమే చెల్లించాల్సి ఉంది. కానీ దేవాలయం అధికారులు ఈ పన్నును సకాలంలో చెల్లించకపోవడంతో రూ.. 3,49,71,341 జరిమానా విధించారు. వీటితోపాటు అదనంగా మరో 25 వేల రూపాయలు కలుపుకొని మొత్తం సుమారు 12 పన్నెండు కోట్లు చెల్లించాలని నోటీసు పంపినట్టు తెలుస్తోంది.



