కొత్త విద్యుత్‌ పాలసీ అంటే..పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తారా?

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పెద్దలు కొత్త విద్యుత్‌ పాలసీ తెస్తామని అంటున్నారనీ,   కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తాం..అని బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో వొదిలే ప్రసక్తే లేదని, వారి పక్షాన ఇంకా గట్టిగా అసెంబ్లీలో, బయట పోరాడతామని  చెప్పారు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలే దేవుళ్లని, బట్ట కాల్చి బిఆర్‌ఎస్‌ పార్టీ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రులు ఆరోపణలు మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండు చేశారు. ఎన్నికల హామీల అమలు కోసల ప్రజల పక్షాన అసెంబ్లీలో ఇంకా గట్టిగా పోరాడతమన్నారు. తెలంగాణ రాష్ట్రం బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కేసీఆర్‌ మొక్కవోని పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వొచ్చిందన్నారు.  కేసీఆర్‌ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.

కేసీఆర్‌ లేకుండా తెలంగాణ లేదని, కేసీఆర్‌ను..తెలంగాణను ఎవరూ వేరు చేయలేరన్నారు. తెలంగాణ వొచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వొచ్చాయని, మన గ్రామలు అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ వొచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్‌, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, దివ్యాంగుల పెన్షన్‌, కేసీఆర్‌ కిట్‌ వొచ్చాయన్నారు. ఇవన్నీ తెచ్చింది  కేసీఆరే అన్నారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బిఆర్‌ఎస్‌ పార్టీకి వేసిన ప్రతి వోటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామని అన్నారు. మనోహరాబాద్‌ను మండలం చేసింది కేసీఆరే అని, కానీ, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందంటుదని హరీష్‌ రావు అన్నారు. కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్‌పై అబద్ధాలు చెబుతున్నారన్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(గడా)ని రద్దు చేశారన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందామనీ, నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా..అని హరీష్‌ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బిఆర్‌ఎస్‌కు ప్రజలంటే బాధ్యత అని, తెలంగాణ ప్రయోజనాల కోసం దిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అని హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, మనోహరాబాద్‌ మహిపాల్‌రెడ్డితో పాటు స్థానిక బిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *